Andhra Pradesh: చంద్రబాబు ‘పోలవరం’ స్థలానికి 1985 నుంచి ఒక్కసారైనా వెళ్లాడా?: కేవీపీ రామచంద్రరావు
- దేవినేని ఓ అబద్ధాన్ని 10 సార్లు చెబుతున్నారు
- పోతిరెడ్డిపాడుకు వ్యతిరేకంగా ఆయన ధర్నాకు దిగారు
- పోలవరం కెనాల్స్ కు వ్యతిరేకంగా టీడీపీ నేతలు స్టేలు తెచ్చారు
ఏపీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఓ అబద్ధాన్ని 10 సార్లు చెప్పి నిజం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు మండిపడ్డారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీని కట్టడానికి వీల్లేదు అని కాళ్లకు గుడ్డలు కట్టుకుని ఉమ సత్యాగ్రహం చేశారని ఆరోపించారు.
ఇప్పటివరకూ తాను దేవినేని ఉమ పేరును ప్రస్తావించలేదనీ, మీడియా మిత్రులు ఈరోజు తన చేత చెప్పించారని వ్యాఖ్యానించారు. అప్పట్లో పోలవరం కాలువల నిర్మాణం జరగకుండా టీడీపీ నేతలు కోర్టులకు వెళ్లి స్టేలు తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆ నేతలే పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.
‘1985 నుంచి చంద్రబాబు నాయుడు అనేవాడు ఒక్కరోజు అయినా పోలవరం ప్రాజెక్టును చూసేందుకు, ప్రాజెక్టు స్థలానికి వెళ్లాడా? నేను ఆరుసార్లు కాలినడకన అక్కడకు వెళ్లాను. వ్యక్తిగతంగా రైతుల దగ్గరకు వెళ్లి ప్రాజెక్టు వల్ల కలిగే ప్రయోజనాలను చెప్పాను.
స్టేలు తీసుకురావద్దని రైతులను కోరాను. అలా ప్రాజెక్టు కోసం నేను కష్టపడుతుంటే మరోవైపు టీడీపీ నేతలు వందలాది కోట్లను అడ్డగోలుగా దోచేసి రామచంద్రరావు రైతులకు అన్యాయం చేశాడని చెబుతున్నారు. ఇలాంటి ప్రబుద్ధులా నన్ను పోలవరం గురించి ప్రశ్నించేది? వీళ్ల మొఖానికి అసలు ఓ సిగ్గుందా?’ అని కేవీపీ విమర్శల వర్షం కురిపించారు.