Crime News: వెంటాడిన మృత్యువు... ప్రాణం తీసిన చిన్నారుల చేపల వేట సరదా!

  • సోమశిల జలాశయం దిగువ మడుగులో మునిగి ఇద్దరు బాలికలు మృతి
  • నెల్లూరు జిల్లాలో ఘటన...మృతులు కడప జిల్లా వాసులు
  • వేసవి సెలవులు గడిపేందుకు బంధువుల ఇంటికి రాగా ఘటన

సరదా ఇద్దరు చిన్నారుల ప్రాణాలను మింగేసింది. వేసవి సెలవుల్లో ఆనందంగా గడిపేందుకు బంధువుల ఇంటికి వచ్చిన వారికి అదే ఆఖరి ప్రయాణం అయింది. నెల్లూరు జిల్లాలోని సోమశిల జలాశయం దిగువ ప్రాంతం మడుగులో మునిగి ఇద్దరు కడప జిల్లా బాలికలు మృత్యువాతపడిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.

వివరాల్లోకి వెళితే... కడప జిల్లా పుల్లంపేట మండలం అనంతయ్యగారిపల్లి గేట్‌కు చెందిన బొమ్మి ప్రసన్న (15), రైల్వేకోడూరు మండలం చియ్యవరం పంచాయతీ ముత్రాసుపల్లికి చెందిన అంజలి (11) వరుసకు అక్కాచెల్లెళ్లు. నెల్లూరు జిల్లా కలువాయి మండలం రాజుపాంలో వీరికి బంధువులు ఉన్నారు. వేసవి సెలవులు కావడంతో సరదాగా గడిపేందుకు వీరిద్దరూ బంధువుల ఇంటికి గురువారం వచ్చారు.

శుక్రవారం మధ్యాహ్నం వీరు మామ వరుసయ్యే ప్రసాద్‌తో కలిసి ఆటోలో సోమశిల జలాశయం వద్దకు వెళ్లారు. ఆటోతో నేరుగా బ్యారేజీ కింది భాగానికి తీసుకువెళ్లిన ప్రసాద్‌ అక్కడి నీటితో తన ఆటోను కడుక్కుంటున్నాడు. అదే సమయంలో పక్కనే ఉన్న మడుగు వద్ద వల ఉండడంతో దానితో సరదాగా చేపలు పట్టేందుకు ప్రసన్న, అంజలి సిద్ధమయ్యారు. వీరి ప్రయత్నాన్ని గమనించిన ప్రసాద్‌ వారించేలోపే బాలికలు ఇద్దరూ మడుగులోకి జారిపడి గల్లంతయ్యారు.

సమాచారం అందుకున్న జలాశయం అధికారులు నీటి విడుదలను నిలిపివేయడంతో పోలీసులు గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. తొలుత అంజలి, తర్వాత ప్రసన్న మృతదేహాలు లభ్యమయ్యాయి. ప్రసన్న టెన్త్‌ పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తుండగా, అంజలి ఐదో తరగతి చదువుతోంది. ఇద్దరు బాలికల మృతితో రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం అలముకుంది. సెలవులు గడిపేందుకు వచ్చిన చిన్నారులు ఇలా మృత్యువాత పడడం రాజుపాలెం గ్రామంలో తీవ్ర విషాదానికి కారణమయింది.

Crime News
Nellore District
cuddapah district
two children died
  • Loading...

More Telugu News