Telugudesam: మోదీ ఏజెంట్లుగా వచ్చి మాపై పెత్తనం చేస్తే చూస్తూ ఊరుకోం: బాబూ రాజేంద్రప్రసాద్
- ఎల్వీ సుబ్రహ్మణ్యం విషయంలో స్పందించిన టీడీపీ నేత
- ఎల్వీ ఆపద్ధర్మ సీఎస్ మాత్రమే
- మా ప్రభుత్వం రాగానే ఎల్వీని తొలగిస్తాం
టీడీపీ నేత బాబూ రాజేంద్రప్రసాద్ రాష్ట్రంలో నూతన సీఎస్ వ్యవహారంపై ఘాటుగా స్పందించారు. సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. టీటీడీకి బంగారం అప్పగించే విషయంలో వైసీపీ ఆరోపణలకు మద్దతు ఇచ్చే విధంగా ఎల్వీ సుబ్రహ్మణ్యం కమిటీ వేశారని విమర్శించారు. ఎల్వీ సుబ్రహ్మణ్యం కేవలం ఎన్నికల సంఘం నియమించిన ఆపద్ధర్మ సీఎస్ మాత్రమేనని రాజేంద్రప్రసాద్ స్పష్టం చేశారు. మళ్లీ తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎల్వీని వెంటనే తొలగించి, నీతిమంతుడైన కొత్త సీఎస్ ను నియమిస్తామని చెప్పారు.
మోదీ ఏజెంట్లుగా వచ్చి ఇక్కడ పెత్తనం చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. తమది మోదీ దయాదాక్షిణ్యాలపై నడిచే ప్రభుత్వం కాదని రాజేంద్రప్రసాద్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం తమ మాట వినని అధికారులను సైతం ఇబ్బందుల పాల్జేస్తోందని ఆరోపించారు.