Chandrababu: జగన్ 'అవెంజర్స్' సినిమాకు వెళ్లడంపై చంద్రబాబు వ్యాఖ్యలు

  • తుపాను వస్తుంటే ప్రతిపక్ష నేతలు విదేశాలకు వెళ్లారు
  • అన్నీ ప్రభుత్వమే చూసుకుంటుందని జగన్ సినిమాకు వెళ్లుంటారు
  • ప్రధాని రివ్యూలకు అనుమతి అక్కర్లేదు, ఏపీ సీఎం రివ్యూలకు మాత్రం అనుమతి కావాలి

ఏపీ సీఎం చంద్రబాబునాయుడు గత రెండ్రోజులుగా ఫణి తుపానుపై సూచనలు చేస్తూ, ఇటు అధికారులు, అటు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఫణి ఇవాళ ఉదయం తీరం దాటిన నేపథ్యంలో ఆయన తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్న తీరును వివరించారు. ఈ సందర్భంగా ఆయన ప్రతిపక్ష నేత జగన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తుపాను సమయంలో విపక్ష నేతలు విదేశాలకు వెళుతున్నారని వ్యాఖ్యానించారు.

జగన్ కూడా తుపానుకు సంబంధించి అన్నీ ప్రభుత్వమే చూసుకుంటుందని హాయిగా సినిమాకు వెళ్లారేమో అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. అయినా, జగన్ ఎప్పుడు రాష్ట్రంలో ఉన్నారని, ఇప్పుడు ఉండడానికి? అంటూ సెటైర్ వేశారు. జగన్ ఇవాళ హైదరాబాద్ లోని ప్రిన్స్ థియేటర్ లో అవెంజర్స్: ఎండ్ గేమ్ చిత్రాన్ని వీక్షించిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు.

అంతకుముందు ఆయన, తుపానుపై పూర్తి స్థాయిలో పర్యవేక్షణకు ఈసీ అడ్డుపడిందని ఆరోపించారు. తుపాను తీరం దాటిందన్న సమాచారం వచ్చిన తర్వాతే తమకు సమీక్షలకు అనుమతి ఇచ్చారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. కాస్త ముందే రివ్యూలు చేయడం ద్వారా అధికారులను సమన్వయం చేయడం వల్ల ప్రజలకు ఎంతో ఉపయుక్తంగా ఉండేదని అన్నారు. కేంద్రంలో ప్రధాని రివ్యూలకు ఎలాంటి అనుమతి అవసరంలేదని, ఏపీ సీఎం విషయానికొచ్చేసరికి అన్ని అనుమతులు ఉండాలని అసహనం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News