Sangareddy: జననేంద్రియాలు లేకుండా ఒంటికాలితో... సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రిలో వింత శిశువు!
- జన్యులోపాలతో బిడ్డ
- బతికే అవకాశాలు లేవన్న వైద్యులు
- అత్యంత అరుదన్న డాక్టర్ అశోక్
సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ వింత శిశువు జన్మించింది. జన్యులోపాల కారణంగా జననేంద్రియాలు లేకుండా ఒంటికాలితో జన్మించిన ఈ శిశువు ప్రస్తుతం క్షేమంగా ఉన్నా, బతికే అవకాశాలు లేవని డాక్టర్లు వెల్లడించారు. నిన్న ఉదయం ఇక్కడికి సమీపంలోని పోతులబొగుడకు చెందిన సుజాత అనే మహిళ ప్రసవం కోసం రాగా, నొప్పులు అధికం కావడంతో డాక్టర్లు సిజేరియన్ చేసి బిడ్డను బయటకు తీశారు. నడుము నుంచి పై భాగం వరకూ బాగానే ఉన్నప్పటికీ, ఆ కింద మాత్రం శరీరమంతా కలిసిపోయి సాగరకన్యలా బిడ్డ ఉందని ఇక్కడి వైద్యుడు అశోక్ వెల్లడించారు. ఇటువంటి బిడ్డలు జన్మించడం అత్యంత అరుదని ఆయన అన్నారు. సిరినోమిలియా అనే జన్యు లోపం కారణంగా బిడ్డ ఇలా పుట్టినట్టు తెలిపారు.