Odisha: పూరీ సమీపంలో తీరం దాటిన ‘ఫణి’.. ఒడిశాలో ముమ్మరంగా సహాయక చర్యలు
- తుపాన్ బంగ్లాదేశ్ వైపు వెళ్లే అవకాశం
- బంగ్లాదేశ్ వైపు వెళ్లే లోపే బలహీనపడనున్న ‘ఫణి’
- పూరీకి సమీపంలో 200 కి.మీ. వేగంతో గాలులు
ఒడిశాలోని పూరీ సమీపంలో‘ఫణి’ తుపాన్ తీరం దాటింది. పూరీకి దక్షిణంగా పూర్తిగా తీరాన్ని దాటినట్టు వాతావరణ శాఖాధికారులు ప్రకటించారు. దీంతో, క్రమంగా బలహీనపడుతోన్న ‘ఫణి’, బాలాసోర్ వద్ద మళ్లీ సముద్రంలోకి వచ్చే అవకాశముందని సంబంధిత అధికారులు అంచనా వేస్తున్నారు. కోల్ కతాను దాటి బంగ్లాదేశ్ వైపు ఈ తుపాన్ వెళ్లే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే, బంగ్లాదేశ్ వైపు వెళ్లే లోపే ‘ఫణి’ పూర్తిగా బలహీనపడనున్నట్టు సమాచారం.
కాగా, తుపాన్ దృష్ట్యా సమాచారం నిమిత్తం హెల్ప్ లైన్ నెంబర్ 1938ను కేంద్ర హోం శాఖ ఏర్పాటు చేసింది. ఒడిశాలో తుపాన్ కారణంగా పూరీకి సమీపంలో 200 నుంచి 240 కి.మీ. వేగంతో గాలులు వీస్తున్నాయి. వేలాది వృక్షాలు, హోర్డింగ్స్, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. పలు ప్రాంతాలు నీట మునిగాయి. ఒడిశా ప్రభుత్వం ఇప్పటికే సహాయక చర్యలను ముమ్మరం చేసింది. రహదారులపై విరిగిపడ్డ వృక్షాలను తొలగిస్తున్నారు. సురక్షిత ప్రాంతాలకు 11 లక్షల మందికిపైగా తరలించారు. నాలుగు వేలకు పైగా పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు.