Kerala: అమ్మాయిలు ముఖం కప్పుకోవడం నిషేధం... ఆదేశాలిచ్చిన కేరళ విద్యాసంస్థ!
- డ్రస్ కోడ్ ను మార్చిన ముస్లిం ఎడ్యుకేషన్ సొసైటీ
- తీవ్ర విమర్శలు వచ్చినా వెనక్కు తగ్గేది లేదని స్పష్టీకరణ
- నిర్ణయాన్ని అమలు చేసి తీరుతామంటున్న ఫజాల్ గఫూర్
కేరళలోని కోజికోడ్ కేంద్రంగా నడుస్తూ, ఎన్నో విద్యా సంస్థలను నిర్వహిస్తున్న ఎంఈఎస్ (ముస్లిం ఎడ్యుకేషన్ సొసైటీ) ఇచ్చిన ఆదేశాలు ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతున్నాయి. తమ పాఠశాలలు, కళాశాలలకు వచ్చే అమ్మాయిలు ఎవరూ ముఖం కప్పుకునేందుకు వీలు లేదని ఓ సర్క్యులర్ జారీ చేసింది. గతంలో కేవలం కొద్ది మంది మాత్రమే ముఖం కప్పుకునేవారని, ఇప్పుడు ప్రతి ఒక్కరూ అదే విధంగా వస్తున్నారని, ఇది సరికాదని చెబుతూ, అమ్మాయిలు ఎవరూ ముఖం కప్పుకోరాదని ఆదేశాలు జారీ చేసింది. ఎంఈఎస్ ఆదేశాలపై సంప్రదాయ ముస్లిం కుటుంబాలు మండిపడుతున్నాయి.
తామిచ్చిన ఆదేశాలపై విమర్శలు చెలరేగుతూ ఉండటంతో ఎంఈఎస్ ఇనిస్టిట్యూషన్స్ అధ్యక్షుడు పీకే ఫజాల్ గఫూర్ స్పందించారు. తామేమీ వివాదాస్పద నిర్ణయాలు తీసుకోలేదని, 2019-20 ఆర్థిక సంవత్సరం నుంచి క్లాస్ లకు వచ్చే అమ్మాయిలు ముఖాన్ని కప్పుకోరాదన్న నిర్ణయాన్ని, డ్రస్ కోడ్ ను పక్కాగా అమలు చేస్తామని అన్నారు.
ఎంఈఎస్ తాజా నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని పలు కాలేజీల వద్ద విద్యార్థి సంఘాలు నిరసనలకు దిగుతున్నాయి. హైకోర్టు ఆదేశాల మేరకు కళాశాలల్లో డ్రస్ కోడ్ పై కాలేజీ మేనేజ్ మెంట్ దే తుది నిర్ణయమని ఈ సందర్భంగా గఫూర్ వ్యాఖ్యానించారు. కేరళ సంప్రదాయంలో ముఖాన్ని కప్పుకోవడమన్నది ఎన్నడూ లేదని, ముఖం కప్పుకుని వస్తుండటంతో ఎవరినీ గుర్తు పట్టలేని పరిస్థితి నెలకొందని, మతపరమైన కారణాలను చెబుతూ డ్రస్ కోడ్ ను నిర్ణయించడానికి తాము వ్యతిరేకమని అన్నారు.