MAA: నాగబాబుపై శివాజీరాజా కామెంట్స్ నాకు కష్టమనిపించాయి: ‘మా’ అధ్యక్షుడు నరేశ్
- ఇటువంటి వ్యాఖ్యలు చేయకుండా ఉంటే మంచిది
- నాగబాబు హయాంలో ‘మా’లో మంచి పనులు చేశారు
- ‘మా’ను వివాదాల్లోకి లాగొద్దు.. కలిసికట్టుగా పని చేద్దాం
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల సమయంలో సీనియర్ నటుడు నరేశ్ ప్యానెల్ కు సపోర్టు చేస్తున్నట్టు ప్రముఖ నటుడు నాగబాబు ప్రకటించడం తెలిసిందే. నాగబాబు చేసిన ఈ ప్రకటనపై అప్పుడు ‘మా’ అధ్యక్షుడిగా ఉన్న శివాజీరాజా, సరైన సమయంలో నాగబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని ఘాటుగా స్పందించడం విదితమే. ఈ ఘటనపై ‘మా’ అధ్యక్షుడు నరేశ్ స్పందిస్తూ, ఈ వ్యాఖ్యలను ‘మా’ అధ్యక్షుడు హోదాలో కాకుండా ఓ సినీ నటుడిగా ఖండిస్తున్నానని అన్నారు. ఇటువంటి వ్యాఖ్యలు చేయకుండా ఉంటే మంచిదని అభిప్రాయపడ్డారు.
నాగబాబుపై వచ్చిన కామెంట్స్ వింటే తనకు కొంచెం కష్టమనిపించిందని చెప్పారు. నాగాబాబు సరిగా నడవలేక పోతున్నారంటూ వ్యాఖ్యలు చేశారని, ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆర్టిస్ట్ ని పర్సనల్ గా డామేజ్ చేయడం అవుతుందని అన్నారు. గతంలో ‘మా’ అధ్యక్షుడిగా వ్యవహరించిన నాగబాబు ఏం చేశారని కొందరు ప్రశ్నించారని, ఆయన హయాంలో కూడా చాలా మంచి పనులు చేశారని గుర్తుచేశారు. నాగబాబు మనస్ఫూర్తిగా తమకు సపోర్ట్ ఇచ్చారని అన్నారు. ‘మార్పు’ కావాలని కోరుకున్నారు కనుకే ఆయన తమకు మద్దతుగా నిలిచారని చెప్పారు.
‘మా’ పిల్లికి బిచ్చం పెట్టలేదంటూ వ్యాఖ్యలు చేయడం కరెక్టు కాదని, రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షుడిగా, శివాజీ రాజా జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు వాళ్లకు పూర్తి సపోర్టు ఇచ్చిన వ్యక్తి నాగబాబు అని కొనియాడారు. ఇప్పటికైనా, మనందరం కలిసి పనిచేద్దామని, భవిష్యత్ లో ‘మా’ను వివాదాల్లోకి లాగొద్దని, వ్యక్తిగతంగా ఎవరినీ దూషించ వద్దని ఓ నటుడిగా కోరుతున్నానని అన్నారు.