Andhra Pradesh: వైఎస్ వివేకా హత్య కేసులో జగన్ ని విచారించాలి: వర్ల రామయ్య డిమాండ్

  • ఇంటి దొంగలను ఎందుకు అరెస్టు చేయలేదు?
  • అవినాశ్ రెడ్డి కాల్ డేటా ఎందుకు తీసుకోలేదు?
  • తన తండ్రిని ఎవరు చంపారో వివేకా కూతురుకి తెలుసు

వైసీపీ అధినేత జగన్ బాబాయ్ వివేకా హత్య కేసు విషయమై టీడీపీ నేత వర్ల రామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు మీడియాతో ఆయన మాట్లాడుతూ, ఈ కేసులో జగన్ ని విచారించాలని డిమాండ్ చేశారు. జగన్ కు తెలిసే వివేకా హత్య జరిగిందని ఆరోపించారు. ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)పైనా ఆయన విమర్శలు గుప్పించారు.

 ఈ కేసును కోల్డ్ స్టోరేజ్ లో పెట్టి, ఇంటి దొంగలను వదిలిపెట్టారని ఆరోపించారు. ఎవరి ఆదేశాలతో ఇంటి దొంగలను అరెస్టు చేయలేదో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) చెప్పాలని ప్రశ్నించారు. తన తండ్రిని ఎవరు చంపారో వివేకా కూతురుకి తెలుసని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో దర్యాప్తు నిలిపివేయాలని హైకోర్టు చెప్పలేదని స్పష్టం చేశారు. జగన్, ఎంపీ అవినాశ్ రెడ్డి కాల్ డేటా తీస్తే అసలు విషయాలు బయటకు వస్తాయని అన్నారు.
 
జగన్, విజయసాయిరెడ్డి, అవినాశ్ రెడ్డిలను ఎందుకు విచారించలేదు? వీరిని విచారించకుండా ఎవరు అడ్డుపడుతున్నారు? దర్యాప్తు చేయకుండా సిట్ వెనుకడుగు ఎందుకు వేస్తోంది? ఉత్సవ విగ్రహాలను అరెస్టు చేసి మూల విరాట్ లను వదిలేస్తారా? అంటూ సిట్ పై  ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ ముగ్గురిని సిట్ వెంటనే విచారించాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News