phoni cyclone: శ్రీకాకుళం జిల్లాలో వర్షాలు మొదలు.. పలుచోట్ల భారీ, తేలికపాటి జల్లులు
- పెరుగుతున్న గాలుల ప్రభావం
- ముందు జాగ్రత్తగా విద్యుత్ సరఫరా నిలిపివేత
- పలు రైళ్ల రద్దు
ఒడిశా తీరానికి సమీపంలోకి ఫణి తుపాన్ దూసుకు వస్తుండడంతో దాని ప్రభావం వల్ల ఒడిశా సరిహద్దున ఉన్న ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లాలో వర్షాలు కురవడం మొదయింది. జిల్లాలోని తీరప్రాంత మండలాల్లో పెద్ద ఎత్తున గాలులు వీస్తుండగా, భారీ, తేలికపాటి జల్లులు కురుస్తున్నాయి.
పలాస, టెక్కలి, సంతబొమ్మాళి, శ్రీకాకుళం మండలాల పరిధిలో ఏకధాటిగా వర్షం కురుస్తుండగా, మిగిలిన చోట్ల తేలికపాటి జల్లులు పడుతున్నాయి. దీంతో ముందు జాగ్రత్త చర్యగా విద్యుత్ శాఖ ఇచ్చాపురం సహా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. తుపాన్ ప్రభావం కారణంగా శ్రీకాకుళం జిల్లా మీదుగా నడిచే పలు రైళ్లను అధికారులు రద్దు చేశారు.
ముప్పు తీవ్రమవుతుండడంతో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగంతో సంప్రదింపులు జరుపుతూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇచ్చాపురం, కవిటి, సోంపేట, పలాస, మందస, టెక్కలి, కొత్తూరు, భామిని, శ్రీకాకుళం మండలాల్లో 9 ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచారు. అత్యవసర సామగ్రిని సిద్ధం చేసి ప్రత్యేక అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ జరుపుతున్నారు.