maithripala sirisena: మా దేశాన్ని ప్రశాంతంగా వదిలేయండి: ఐసిస్ కు శ్రీలంక అధ్యక్షుడి విన్నపం
- పేలుళ్ల ఘటన వెనుక విదేశీ మాస్టర్ మైండ్ ఉంది
- చిన్న దేశాలను లక్ష్యంగా చేసుకోవడం ఐసిస్ కొత్త వ్యూహం
- పేలుళ్లకు వాడిన బాంబులను స్థానికంగానే తయారు చేశారు
ఈస్టర్ పర్వదినాన సంభవించిన వరుస పేలుళ్ల ఘటన వెనుక విదేశీ మాస్టర్ మైండ్ ఉందని శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన అన్నారు. ఈ పేలుళ్లకు తామే కారణమని ఐసిస్ ప్రకటించుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐసిస్ ని ఉద్దేశిస్తూ, తమ దేశాన్ని ప్రశాంతంగా, ఒంటరిగా వదిలేయాలని అన్నారు. చిన్న దేశాలను లక్ష్యంగా చేసుకోవడం ఐసిస్ కొత్త వ్యూహం కావచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
శ్రీలంకకు చెందిన కొందరు గత దశాబ్ద కాలంలో... ఐసిస్ నుంచి శిక్షణ పొందేందుకు విదేశాలకు వెళ్లారని, వీరి విషయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. ఈస్టర్ సందర్భంగా వాడిన బాంబులన్నీ స్థానికంగానే తయారు చేశారనే విషయం విచారణలో వెల్లడయిందని చెప్పారు.
మరోవైపు, శ్రీలంకలో ఇప్పటికీ హైఅలర్ట్ కొనసాగుతోంది. ఉగ్రవాదులు రంజాన్ మాసానికి ముందు మరిన్ని దాడులకు తెగబడవచ్చనే సమాచారంతో భద్రతాదళాలను, ఇంటెలిజెన్స్ ను అప్రమత్తం చేశారు.