Haryana: రైలొస్తోందని పక్కకు దూకితే, మరో రైలు ఢీకొట్టేసింది... ముగ్గురి దుర్మరణం!
- హర్యానాలోని పానిపట్ లో ఘటన
- పెళ్లి కోసం వచ్చిన నలుగురు యువకులు
- సెల్ఫీలకని వెళ్లి ముగ్గురి మృత్యువాత
హర్యానాలోని పానిపట్ వద్ద ఘోర ప్రమాదం జరిగింది. రైలు పట్టాలపై నిలబడి సెల్ఫీలు దిగుతున్న నలుగురు స్నేహితులు, రైలు వస్తుండటాన్ని గమనించి, పక్కనే ఉన్న పట్టాలపైకి దూకగా, ఆ ట్రాక్ పై వస్తున్న రైలు వారిని ఢీకొంది. ఈ నలుగురిలో ముగ్గురు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. వీరంతా పక్కనే ఉన్న ట్రాక్ పై వస్తున్న రైలును గమనించలేదని పోలీసు అధికారి ఎంఎస్ దబాస్ తెలిపారు. వీరిలో ఒకరు మాత్రం తప్పించుకున్నారని, వీరంతా పానిపట్ లో జరుగుతున్న ఓ వివాహ వేడుకలో పాల్గొనేందుకు వచ్చారని ఆయన తెలిపారు. మృతుల్లో ఇద్దరి వయసు 19 సంవత్సరాలు కాగా, మరొకరి వయసు 18 సంవత్సరాలని తెలిపారు.
తాము ఎంతో రిస్క్ ఉన్న సెల్ఫీలు దిగగలమని నిరూపించాలన్న ఉద్దేశంతో వారు రైలు పట్టాలెక్కారని, అదే వారి ప్రాణాలను హరించిందని అన్నారు. ఘటనపై కేసు నమోదు చేశామని, విచారణ జరుగుతోందని వెల్లడించారు. కాగా, ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లెక్కల ప్రకారం 2011 నుంచి 2017 మధ్య సెల్ఫీలు దిగుతూ, పొంచివున్న ప్రమాదాన్ని పసిగట్టలేక ఇండియాలో 259 మంది అసువులు బాశారు. సెల్ఫీ మరణాల్లో ఇండియా ముందుండగా, ఆపై రష్యా, యూఎస్, పాకిస్థాన్ లు ఉన్నాయి. 2017లో కర్ణాటకలోని ఓ రైల్వే ట్రాక్ పైనా ఇటువంటి ఘటనే జరిగింది.