Jagan: సీఎంగా జగన్ ప్రమాణస్వీకారోత్సవానికి ముహూర్తం కూడా పెట్టేసిన దేవనాడీ జ్యోతిష్యులు!
- మే26న దివ్యమైన ఘడియలు!
- ఏపీలో గెలిచేది జగనే!
- తెలంగాణలో టీఆర్ఎస్ గెలుస్తుందని ముందే చెప్పామంటున్న జ్యోతిష్యులు
ఏపీలో పోలింగ్ పూర్తయిన పిమ్మట ఫలితాల కోసం ఎక్కువ కాలం ఆగాల్సి రావడంతో ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. ఏప్రిల్ 11న పోలింగ్ జరిగితే మే 23న ఫలితాలు రానున్నాయి. అయితే, ఈ ఎన్నికల్లో గెలిచేది జగనే అంటున్నారు దేవనాడీ జ్యోతిష్యులు. విజయనగరం జిల్లా పార్వతీపురం శ్రీవిద్యా సర్వమంగళాదేవి పీఠానికి చెందిన జ్యోతిష్యుడు మురపాక కాళిదాసు శర్మ ఇప్పటికే జగన్ ప్రమాణస్వీకారోత్సవానికి ముహూర్తం కూడా పెట్టేశారు.
జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడానికి సప్తమీ తత్కాల అష్టమీ ఆదివారం మే 26 ఉదయం 9.29 గంటలకు దివ్యమైన ఘడియలు ఉన్నాయని చెబుతున్నారు. జగన్ జన్మనక్షత్రం రోహిణి అని, వైసీపీ ఆవిర్భావదినం ఆరుద్ర నక్షత్రాల కలయికలో అద్భుతమైన ముహూర్తం అని కాళిదాసు శర్మ తెలిపారు. గతంలో తాము తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుస్తుందని 8 నెలల ముందే చెప్పామని, దేవనాడీ కాలచక్ర గ్రహ గతులను అనుసరించి కచ్చితమైన ఫలితాలు చెప్పామని అన్నారు.
ఇప్పుడు ఏపీలో కూడా జగనే విజేత అని పేర్కొన్నారు. జగన్ ఎన్నికల్లో విజయం సాధించాలని తాము మార్చి 27 నుంచి ఏప్రిల్ 12 వరకు నీలాపతాక సహిత రాజశ్యామల యాగం చేసి, జగన్ చేతులమీదుగా వరుణ ప్రధానం తీసుకుని యాగాన్ని ముగించినట్టు శర్మ వివరించారు.