Ness Wadiya: కింగ్స్ ఎలెవన్ యజమాని నెస్ వాడియాకు రెండేళ్ల జైలుశిక్ష
- జపాన్ లో డ్రగ్స్ తో పట్టుబడ్డ నెస్ వాడియా
- కేసును విచారించిన సాపోరో కోర్టు
- రెండేళ్ల శిక్ష విధించిన న్యాయమూర్తి
ఐపీఎల్ ఫ్రాంచైజీ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ యజమాని నెస్ వాడియాకు జపాన్ లో రెండు సంవత్సరాల జైలు శిక్ష ఖరారైంది. గత సంవత్సరం మార్చిలో ఆయన 25 గ్రాముల మత్తు పదార్థాలతో జపాన్ లో పట్టుబడగా, కేసు విచారణ కొనసాగిందని, న్యాయమూర్తి శిక్షను ఖరారు చేశారని 'ఫైనాన్షియల్ టైమ్స్' పత్రిక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. తాను కేవలం వ్యక్తిగత వాడకం కోసం డ్రగ్స్ తన వద్ద ఉంచుకున్నానని అప్పట్లో వాడియా వాదించారు. ఉత్తర జపాన్ ద్వీపం హొక్కైడో లోని న్యూ ఛిటోస్ ఎయిర్ పోర్టులో వాడియా వద్ద అప్పట్లో డ్రగ్స్ దొరికాయి.
కాగా, వాడియా గ్రూప్ బాంబే డయ్యింగ్, బాంబే బర్మన్ ట్రేడింగ్, బ్రిటానియా ఇండస్ట్రీస్ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. గో ఎయిర్ లోనూ ఈ సంస్థకు వాటాలున్నాయి. ఎంతో కఠినంగా జపాన్ నార్కోటిక్స్ చట్టాల మేరకు సాపోరో జిల్లా కోర్టు కేసును విచారించి, రెండేళ్ల శిక్షను విధించడంతో పాటు, దాన్ని ఐదు సంవత్సరాలు సస్పెన్షన్ లో ఉంచింది. తాజా పరిణామాలపై వాడియా గ్రూప్ ఇంకా స్పందించలేదు.