VVPAT: వీవీప్యాట్ స్లిప్పులను ఎలా లెక్కించాలంటే... మార్గదర్శకాలు జారీ చేసిన ఈసీ!

  • మే 23న కౌంటింగ్
  • లాటరీ ద్వారా వీవీప్యాట్ యంత్రాల ఎంపిక
  • లెక్కింపునకు 2 గంటల సమయం
  • కౌంటింగ్ లోగా సిబ్బందికి శిక్షణ

మే 23న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెల్లడి కానుండగా, ప్రతి పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ఐదు వీవీ ప్యాట్ మెషీన్ లలోని స్లిప్ లను లెక్కించి సరిచూడాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో లెక్కింపుపై ఈసీ మార్గదర్శకాలు జారీ చేసింది. లెక్కింపు సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనుసరించాల్సిన పద్ధతులపై ఉద్యోగులకు అవగాహన కల్పిస్తామని తెలిపారు.

లాటరీ ద్వారా లెక్కించి, సరిచూడాల్సిన ఐదు వీవీప్యాట్ యంత్రాలను తొలుత ఎంపిక చేస్తారు. అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని అన్ని ఈవీఎంలలోనూ పోలైన ఓట్లను లెక్కించిన తరువాత వీవీ ప్యాట్ లను తీసుకు వస్తారు. సదరు పోలింగ్ కేంద్రంలో పోలైన ఓట్లతో రూపొందించిన ఫారమ్-17తో వీవీప్యాట్ స్లిప్ లను సరిపోలుస్తారు.

తొలుత స్లిప్ లను ఏజంట్ల ముందు బయటకు తీసి, అభ్యర్థుల వారీగా వేరు చేసి, 25 చొప్పున కట్టలు కట్టి లెక్కిస్తారు. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి 2 గంటలకు పైగా సమయం పట్టవచ్చని ఎన్నికల సంఘం అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే, కేవలం ఐదు యంత్రాల్లోని స్లిప్ లను మాత్రమే లెక్కబెట్టాల్సి వుండటంతో, ఐదు వీవీప్యాట్ లనూ ఒకేసారి తెరవనున్నారు. ఈవీఎంలను లెక్కించే టేబుల్ పైనే ట్రేలను ఏర్పాటు చేసి వాటిల్లోనే చీటీలను వేసి లెక్కించాల్సివుంటుంది.

ఒక్కో లోక్ సభ సెగ్మెంట్ లో 7 అసెంబ్లీ నియోజకవర్గాలుంటాయి కాబట్టి, మొత్తం 35 వీవీ ప్యాట్ మెషీన్లను లెక్కించాల్సివుంటుంది. రిటర్నింగ్ అధికారి నేతృత్వంలో ఈ ప్రక్రియ జరుగుతుంది. కౌంటింగ్ లోపే లెక్కింపుపై సిబ్బందికి శిక్షణా తరగతులు నిర్వహించనున్నట్టు ఉన్నతాధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News