Tamilnadu: సాక్షాత్తు జగన్మాతకే శఠగోపం పెట్టిన పూజారి... 100 ఏళ్లనాటి కథ!

  • 700 ఏళ్ల నాటి విగ్రహం చోరీ
  • పూజారే అసలు దొంగ
  • గోడలో దాచి పూజలు చేసిన వైనం

తమిళనాడులోని మధురై నగరానికి ఆధ్యాత్మిక నగరంగా ఎంతో పేరుంది. ఇక్కడ అనేక ఆలయాలు ఉన్నాయి. వాటిలో మేలూరు ఆలయం ఒకటి. ఇది ఎంతో ప్రాచీనమైనది. మధురైలోని నాగైకడియ వీధిలో ఉండే ఆ ఆలయంలో ఉన్న ద్రౌపది అమ్మన్ అమ్మవారి విగ్రహం ఉన్నట్టుండి కనిపించకుండా పోయింది. ఈ ఘటన 1915లో జరిగింది. అప్పట్లో దీనిపై బ్రిటీష్ అధికారులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకపోయింది. అక్కడక్కడ సోదాలు చేసిన బ్రిటీషర్లు విగ్రహం దొరక్కపోవడంతో ఆ విషయాన్ని అంతటితో వదిలేశారు.

అయితే, మేలూరు ఆలయంలో మరికొన్నిరోజుల్లో వార్షిక ఉత్సవాలు నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో మురుగేశన్ అనే 60 ఏళ్ల వ్యక్తి ద్రౌపది అమ్మన్ విగ్రహాన్ని భద్రంగా తీసుకువచ్చి ఆలయ అర్చకులకు అప్పగించాడు. దాదాపు 100 ఏళ్లనాడు మాయమైన ఆ విగ్రహం మళ్లీ ఇన్నాళ్లకు కనిపించడంతో ఆలయవర్గాలు దిగ్భ్రాంతికి గురయ్యాయి. మురుగేశన్ అనే ఆ వ్యక్తి చెప్పిన విషయాలు విని వాళ్లకు నోట మాట రాలేదు.

విగ్రహం చోరీ చేసింది సాక్షాత్తు మురుగేశన్ తాత కరుప్పుస్వామి. ఆయన అప్పట్లో మేలూరు ఆలయ పూజారుల్లో ఒకరు. ఒకరోజు తోటి పూజారితో గొడవ జరగడంతో నెపం అతడిపైకి నెట్టేందుకు ఆ విగ్రహాన్ని ఎత్తుకెళ్లాడు. అసలే అమ్మవారి విగ్రహం! ఇంట్లో పెట్టుకుని ఏంచేయాలో తెలియక గోడ పగులగొట్టి దాంట్లో దాచి సిమెంటుతో ప్లాస్టింగ్ చేశాడు. అప్పటినుంచి భయం, భక్తితో ఆ గోడకు పూజలు చేసేవాడు.  

నేడు ఆ విగ్రహాన్ని తెచ్చిన మురుగేశన్ తన బాల్యంలో.. తన తాత, తండ్రి ప్రతిరోజూ గోడకు పూజలు చేయడం ఏంటో తెలియక ఆశ్చర్యపోతుండేవాడు. అయితే, కాలక్రమంలో ఆయన కుటుంబ సభ్యులు శాపగ్రస్తుల్లా మారి వింత వ్యాధులతో మరణించడంతో ఇక అసలు విషయం చెప్పేయాలనుకున్నాడు. ప్రస్తుతం ఆ ఇంట్లో ఉంటున్న యజమాని అంగీకారంతో ఆ గోడను తొలిచి విగ్రహాన్ని బయటికి తీశాడు. అది ద్రౌపది అమ్మన్ విగ్రహం అని తెలిసి, ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటే మంచిదని తలిచి మేలూరు ఆలయానికి చేర్చాడు. పూజారే అమ్మవారి విగ్రహాన్ని మాయం చేశాడని తెలిసి ఆలయవర్గాలు నమ్మలేకపోయారట.

  • Loading...

More Telugu News