Andhra Pradesh: పోస్టల్ బ్యాలెట్ వ్యవహారం.. విశాఖ జిల్లా కలెక్టర్ తో వైసీపీ నేతల భేటీ!

  • ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్లు అందేలా చర్యలు తీసుకోండి
  • కలెక్టర్ కాటమనేని భాస్కర్ ను కోరిన వైసీపీ నేతలు
  • సానుకూలంగా స్పందించిన విశాఖ కలెక్టర్

ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ కాటమనేని భాస్కర్ తో ఈరోజు వైసీపీ నేతలు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా సార్వత్రిక ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉద్యోగులందరికీ పోస్టల్ బ్యాలెట్లు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇందుకు కలెక్టర్ కూడా సానుకూలంగా స్పందించారు. ఉద్యోగులందరికీ పోస్టల్ బ్యాలెట్లు అందేలా తగిన చర్యలు తీసుకుంటున్నామని వారికి వివరించారు. ఈ మేరకు జిల్లా యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు జారీచేశామని చెప్పారు.

మరోవైపు వైసీపీ అరకు అభ్యర్థి  చెట్టి ఫాల్గుణ ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదీని కలిశారు. చాలామంది గిరిజనులకు నియోజకవర్గంలో పోలింగ్ కేంద్రాల మార్పు గురించి తెలియలేదని చెప్పారు. దీంతో వారంతా ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారని అన్నారు. కాబట్టి అరకు నియోజకవర్గంలోని బంగాపుట్ పంచాయతీలోని రెండు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై ద్వివేదీ స్పందిస్తూ.. ఈ విషయమై జిల్లా అధికారులను నివేదిక కోరామనీ, దాని ఆధారంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News