Andhra Pradesh: ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ విషయంలో ఇప్పటికీ నాకు బెదిరింపులు వస్తున్నాయి!: నిర్మాత నట్టి కుమార్
- తప్పు చేయకుంటే బాబుకు భయమెందుకు?
- ఓ ఎమ్మెల్యే నాకు ఎస్సైతో ఫోన్ చేయించాడు
- హైదరాబాద్ లో మీడియాతో తెలుగు నిర్మాత
కేంద్ర ఎన్నికల సంఘం, సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను కొందరు నేతలు కొన్నిరోజుల పాటు ఆపగలిగారని తెలుగు నిర్మాత నట్టి కుమార్ తెలిపారు. నిన్నటివరకూ ఎన్నికల్లో ప్రభావం చూపొచ్చని సినిమాను ఆపారనీ, ఇప్పుడు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాకు అడ్డంకులు కల్పించడం ఏంటని మండిపడ్డారు.
ఈ సినిమా పంపిణీ హక్కులను ఏపీలో తాను కొనుక్కున్నానని ఆయన చెప్పారు. తాను ఏ తప్పు చేయనప్పుడు చంద్రబాబు ఈ సినిమాను ఎందుకు అడ్డుకుంటున్నారని నిలదీశారు. ఓ టీవీ ఛానల్ లో ఈరోజు జరిగిన చర్చా కార్యక్రమంలో నట్టి కుమార్ మాట్లాడారు.
లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదలను ఆపేయాలని ఇప్పటికీ తనకు బెదిరింపులు వస్తున్నాయని నట్టి కుమార్ తెలిపారు. 'ఇటీవల ఓ ఎస్సైతో నాకు ఫోన్ చేయించిన ఓ ఎమ్మెల్యే నా థియేటర్ లో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను ప్రదర్శించవద్దని కోరాడు. కానీ ఇందుకు నేను అంగీకరించలేదు' అని స్పష్టం చేశారు.
‘సినిమావాళ్లకు ఒకటే చెబుతున్నా.. పార్టీలు శాశ్వతం కాదు, ప్రభుత్వాలు శాశ్వతం కాదు. మన అందరిదీ సినిమా కులం. ఎన్టీఆర్ మీద సూపర్ స్టార్ కృష్ణగారు ఎన్నో సినిమాలు తీశారు. అప్పుడు రాని ఇబ్బంది ఈ ఒక్క సినిమాకే ఎందుకు వస్తోంది? నిజాలు వస్తాయని ఏపీ సీఎం చంద్రబాబు భయపడుతున్నారు’ అని నట్టి కుమార్ చెప్పారు.