KCR: పీఠాధిపతి ఆశీస్సులకు సమయం దొరుకుతుంది కానీ, విద్యార్థుల కుటుంబాలను పరామర్శించడానికి సమయం లేదా?: కేసీఆర్ పై వీహెచ్ ఫైర్
- స్వాముల వైపే కాదు ఓట్లేసిన జనాల వైపూ చూడాలి
- జనాల్ని చంపడంలో కేసీఆర్ తర్వాతే ఎవరైనా
- మరీ ఇంత అహంభావమా?
తెలంగాణలో ఇంటర్ మార్కుల వ్యవహారం ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. 20 మందికి పైగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న నేపథ్యంలో తమపై వస్తున్న విమర్శలకు జవాబు చెప్పేందుకు కేసీఆర్ ప్రభుత్వం ఆచితూచి వ్యవహరించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో, కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు కూడా విమర్శనాస్త్రాలు సంధించారు.
విద్యార్థుల మరణాలు ప్రభుత్వం చేసిన హత్యలుగానే భావిస్తామని అన్నారు. రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా, పిల్లలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా సీఎం కేసీఆర్ ఎందుకు స్పందించడంలేదని మండిపడ్డారు. శారదా పీఠాధిపతి ఆశీస్సుల కోసం సమయం కేటాయించిన కేసీఆర్ కు ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలను పరామర్శించేందుకు సమయం దొరకలేదా? అని నిలదీశారు. స్వాముల వైపే కాకుండా ఓట్లేసి గెలిపించిన ప్రజల వైపు కూడా చూడాలని కేసీఆర్ కు హితవు పలికారు.
"ప్రజల్ని అన్యాయంగా చంపడంలో కేసీఆర్ తర్వాతే ఎవరైనా, తెలంగాణ సర్కారుకు ఎందుకింత అహంభావం?" అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ దశలో వీహెచ్ ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై మాట్లాడుతూ భావోద్వేగాలు భరించలేక కంటతడి పెట్టారు.