Andhra Pradesh: రామ్ గోపాల్ వర్మను అందుకే అదుపులోకి తీసుకున్నాం.. ప్రకటించిన విజయవాడ పోలీసులు!

  • విజయవాడలో సెక్షన్ 144 అమలవుతోంది
  • సభలు, సమావేశాలకు ముందస్తు అనుమతి కావాలి
  • వర్మ సభతో ఘర్షణలు చెలరేగే ప్రమాదముంది

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మను విజయవాడ పోలీసులు ఈరోజు అదుపులోకి తీసుకుని గన్నవరం ఎయిర్ పోర్టుకు తరలించిన సంగతి తెలిసిందే. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాపై విజయవాడలో రోడ్డుపై మీడియా సమావేశం ఏర్పాటుచేస్తానని వర్మ ప్రకటించడంతో అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. తాజాగా ఈ విషయమై విజయవాడ పోలీసులు స్పందించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో విజయవాడలో పోలీస్ చట్టంలోని సెక్షన్ 30, సెక్షన్ 144 అమలులో ఉన్నాయని తెలిపారు.

అందువల్లే బహిరంగ ప్రదేశాలు, ప్రాంతాల్లో సభలు-సమావేశాలకు ఎలాంటి అనుమతి లేదని స్పష్టం చేశారు. ఒకవేళ ఇలాంటి సభలు, సమావేశాలు పెట్టుకోవాలంటే ముందస్తు అనుమతి తీసుకోవడం తప్పనిసరి అని తేల్చిచెప్పారు. రామ్ గోపాల్ వర్మ ప్రెస్ మీట్ పెడతానన్న ప్రాంతం పైపుల రోడ్ అనీ, అక్కడ నిత్యం వేలాది వాహనాలు హైదరాబాద్ వైపు వెళుతుంటాయని అన్నారు.

ఒకవేళ అక్కడ ట్రాఫిక్ జామ్ జరిగితే, అత్యవసర సేవలకు కూడా ఆటంకం ఏర్పడే ప్రమాదముందని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా ఈ కార్యక్రమం వల్ల రెండువర్గాల మధ్య ఘర్షణ తలెత్తే ప్రమాదం కూడా ఉందన్నారు. అందువల్లే వర్మ మీడియా సమావేశానికి అనుమతి ఇవ్వలేదని పోలీసులు వివరణ ఇచ్చారు. ఈ మేరకు విజయవాడ పోలీసులు ఓ ప్రకటన విడుదల చేశారు.

Andhra Pradesh
RGV
Police
Vijayawada
lakshmies ntr
  • Loading...

More Telugu News