Tirumala: తిరుమల పరకామణి విధులకు 60 మంది సిబ్బంది కేటాయింపు
- వారం రోజుల్లో పెండింగ్ లెక్కింపు పూర్తి చేయాలని నిర్ణయం
- ఇందుకోసం అదనపు షిప్టు ఏర్పాటు
- 40 మంది మజ్దూర్‌ల తొలగింపుతో ప్రతిష్టంభన
తిరుమల తిరుపతి దేవస్థానం పరకామణి ఆదాయం లెక్కింపునకు మార్గం సుగమమైంది. పరకామణిలో పనిచేస్తున్న 40 మంది మజ్దూర్‌లను టీటీడీ దేవస్థానం గుట్టుచప్పుడు కాకుండా తొలగించడంతో గడచిన వారం రోజులుగా నగదు తప్ప మిగిలిన ఆదాయ వనరుల లెక్కింపు నిలిచిపోయిన విషయం తెలిసిందే. దీనిపై విమర్శలు వెల్లువెత్తడంతో దేవస్థానం అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. పరకామణిలో విధులు నిర్వహించేందుకు 60 మందిని కేటాయించారు. పేరుకుపోయి ఉన్న ఆదాయ వనరుల లెక్కింపును వారం రోజుల్లో పూర్తి చేయాలని నిర్ణయం తీసుకుంది. పరకామణి వ్యవహారాలను ప్రస్తుతం టీటీడీ ఈవో, జేఈవో పర్యవేక్షిస్తున్నారు. వారం రోజులపాటు పరకామణిలో అదనపు షిప్టు ఏర్పాటు చేసిన టీటీడీ సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి 11 గంట వరకు అదనపు సిబ్బందితో లెక్కింపు కార్యక్రమం కొనసాగిస్తోంది.