Jet Airways: జెట్ ఎయిర్‌వేస్ సంక్షోభం తర్వాత తొలి ఆత్మహత్య.. భవనంపై నుంచి దూకి ప్రాణాలు తీసుకున్న ఉద్యోగి
- కేన్సర్ వల్లే ఆత్మహత్య చేసుకున్నాడన్న పోలీసులు
- కాదు, ఆర్థిక ఇబ్బందుల వల్లేనన్న జెట్ ఎయిర్‌వేస్ ఉద్యోగుల సంఘం
- బాధితుడి కుమారుడు కూడా జెట్ ఎయిర్‌వేస్ ఉద్యోగే
మహారాష్ట్రలోని పల్‌గఢ్‌కు చెందిన జెట్ ఎయిర్‌వేస్ ఉద్యోగి ఒకరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. గత కొంతకాలంగా కేన్సర్‌తో బాధపడుతున్న ఆయన మనోవేదనకు లోనై ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. జిల్లాలోని నలసోపర ఈస్ట్‌లో నివసిస్తున్న శైలేంద్ర సింగ్ (45) తన ఇంటి నాలుగో అంతస్తు నుంచి కిందికి దూకి ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిపారు.
అయితే, జెట్ ఎయిర్‌వేస్ స్టాఫ్ అండ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కథనం వేరేలా ఉంది. ఇటీవల సంస్థ సంక్షోభంలో కూరుకుపోయి వేతనాలు కూడా ఇవ్వలేని స్థితికి చేరుకోవడంతో శైలేంద్ర సింగ్ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాడని, అతడి ఆత్మహత్యకు అదే కారణమని పేర్కొన్నారు. అయితే, పోలీసులు మాత్రం శైలేంద్ర కేన్సర్‌తో బాధపడుతున్నాడని, కీమోథెరపీ కూడా చేయించుకుంటున్నాడని పోలీసులు తెలిపారు.
కాగా, జెట్ ఎయిర్‌వేస్ సేవలు నిలిచిపోయిన తర్వాత జరిగిన తొలి ఆత్మహత్య ఘటన ఇదే కావడం గమనార్హం. కాగా, శైలేంద్ర కుమారుడు కూడా జెట్ ఎయిర్‌వేస్‌లోనే పనిచేస్తున్నాడు. శైలేంద్ర ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.