Congress: ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ పరిపాలన చేయాలని మోదీ అనుకుంటున్నారు: చిదంబరం
- దేశం ఎప్పటికీ సురక్షితంగానే ఉంటుంది
- దేశానికి సమర్థవంతమైన త్రివిధ దళాలు ఉన్నాయి
- కాంగ్రెస్ ఎందుకు దేశాన్ని సురక్షితంగా ఉంచలేదు?
కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు చేశారు. మోదీ తన పాలనలో ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం ద్వారా పట్టు సాధించాలని కోరుకుంటున్నారని ఆరోపించారు. దేశాన్ని సురక్షితంగా ఉంచుతామని పదేపదే చెప్పుకుంటున్నారని, దేశాన్ని సురక్షితంగా ఉంచడం అంటే అన్ని వర్గాల వారిని బాధించడమా? అంటూ ప్రశ్నించారు. దేశాన్ని సురక్షితంగా ఉంచడం అంటే పలు వర్గాల ప్రజలు, దళితులు, మహిళలు, మైనారిటీ వర్గాలు, పాత్రికేయులు, రచయితలను సురక్షితంగా ఉంచకపోవడమేనా? అంటూ నిలదీశారు.
మరోవైపు, కాంగ్రెస్ కు దేశాన్ని సురక్షితంగా ఉంచే సత్తా లేదంటున్నారని, 1947 నుంచి 1971 వరకు జరిగిన యుద్ధ సమయాల్లో దేశం ఎవరి చేతుల్లో సురక్షితంగా ఉందో మోదీ గ్రహించాలని హితవు పలికారు. దేశం ఎప్పటికీ సురక్షితంగానే ఉంటుందని, అందుకు కారణం సమర్థవంతమైన మన త్రివిధ దళాలేనని చిదంబరం స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ఆయన విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన 'వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్' (ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో) పంక్తులను ప్రస్తావించారు. ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో అలాంటి దేశం కోసం ప్రజలు ఓటేస్తారని మోదీకి చురకలంటించారు.