Kumaram Bheem Asifabad District: ఆగ్రహంలో విచక్షణ కోల్పోయిన ఉపాధ్యాయుడు.. సొంతింటికే నిప్పు!

  • భార్య, పిల్లలు ఇంట్లో ఉండగానే పైశాచికత్వం
  • బయటకు పరుగు తీసి తప్పించుకున్న కుటుంబ సభ్యులు
  • ఇంట్లో సామానంతా కాలి బూడిద

ఆగ్రహంలో విచక్షణ కోల్పోయి సొంత ఇంటికే నిప్పంటించాడు ఓ ఉపాధ్యాయుడు. బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నావని భార్య నిలదీసిందన్న కోపంతో ఆమెను, పిల్లల్ని ఇంట్లో పెట్టి ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు సదరు ఉపాధ్యాయుడు. తెలంగాణ కుమరంభీం జిల్లా జైనూరు మండలం జంగాం గ్రామంలో గురువారం రాత్రి చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. గ్రామానికి చెందిన కుమ్ర నారాయణ ప్రభుత్వ ఉపాధ్యాయుడు. ఇతనికి భార్య యమునాభాయ్‌, ముగ్గురు పిల్లలు ఉన్నారు.

ఇల్లు, పిల్లల్ని పట్టించుకోకుండా నారాయణ వ్యవహరిస్తుండడంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. గురువారం రాత్రి కూడా ఇద్దరి మధ్య వివాదం నెలకొంది. భార్యతో మాటామాటా పెరగడంతో విచక్షణ కోల్పోయిన నారాయణ ఇంట్లో ఉన్న వస్త్రాలపై కిరోసిన్‌ పోసి వాటికి నిప్పంటించి బయటకు పారిపోయాడు. అప్పటికి ఇంట్లో భార్యతోపాటు పిల్లలు కూడా ఉన్నారు.

మంటలు బారీగా వ్యాపించడంతో వారంతా భయంతో బయటకు పరుగులు తీశారు. గ్రామస్థులు అప్రమత్తమై వెంటనే విద్యుత్‌ సరఫరా నిలిపివేసి మంటలు అదుపు చేశారు. అయితే అప్పటికే ఇంట్లో గ్యాస్‌ సిలెండర్‌ పేలడంతో మొత్తం ఫర్నీచర్‌, ఇతర వస్తువులు, బంగారం ఆభరణాలు కాలి బూడిదయ్యాయి. జైనూరు పోలీసులు ఘటనా స్థలిని సందర్శించారు. నిందితుడు నారాయణ కోసం గాలిస్తున్నారు.

Kumaram Bheem Asifabad District
jainuru mandal
Fire Accident
teacher acton
  • Loading...

More Telugu News