TTD: టీటీడీ మరో వివాదాస్పద నిర్ణయం...40 మంది పరకామణి మజ్దూర్ల తొలగింపు?
- దీంతో ఆదాయ లెక్కింపు కార్యక్రమానికి అంతరాయం
- నోట్ల లెక్కింపు తప్ప మిగిలిన పనులకు బ్రేక్
- గతంలో మాదిరి సిబ్బందిని కేటాయించాలంటున్న బాధ్యులు
సిబ్బంది తొలగింపు అంశంపై ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్న తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తాజాగా మరో వివాదానికి కేంద్రబిందువు అయ్యేలా కనిపిస్తున్నారు. తాజాగా పరకామణిలో పనిచేస్తున్న 40 మంది మజ్దూర్లను గుట్టుచప్పుడు కాకుండా తొలగించారని, దీంతో స్వామి వారి ఆదాయ లెక్కింపు పనులు నిలిచిపోయాయని సమాచారం.
స్వామి వారికి రోజూ హుండీ ద్వారా రెండు కోట్ల నుంచి మూడు కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. ఇందులో నగదు, బంగారం, ఇతరత్రా వస్తువులు ఉంటాయి. వీటిని ఏ రోజుకారోజు వేరుచేసి వివరాలు నమోదు చేసి టీటీడీ ట్రెజరీలో జమ చేయడం ఆనవాయితీ. అయితే మజ్దూర్ల తొలగింపుతో కేవలం నోట్ల లెక్కింపు తప్ప మిగిలి రూపాల్లోని ఆదాయాన్ని లెక్కించడం లేదని తెలిసింది.
దీనివల్ల బంగారం, ఇతర వస్తువులు పేరుకు పోతున్నాయని, తక్షణం టీటీడీ అధికారులు తమకు సిబ్బందిని కేటాయించాలని పరకామణి నిర్వాహకులు కోరుతున్నారు. ఇప్పటికే గత ఏడాది సెప్టెంబర్ నుంచి అప్రైజర్ లేకుండా పరకామణి కొనసాగుతుండగా, ఎటువంటి ప్రత్యామ్నాయం చూపకుండా మజ్దూర్ల తొలగింపు నిర్ణయంతో మరోవివాదం నెలకొనేలా కనిపిస్తోంది.