Telangana: గ్లోబరినా ఉపయోగించిన సాఫ్ట్ వేర్ లోనే లోపాలు... అందుకే ఇంటర్ మార్కులలో తప్పులతడకలు: త్రిసభ్య కమిటీ
- సాఫ్ట్ వేర్ మార్చకపోతే రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ లో కూడా తప్పులొస్తాయి
- ఆసక్తికర అంశాలు గుర్తించిన కమిటీ
- కొనసాగుతున్న విచారణ
తెలంగాణలో మునుపెన్నడూ లేనంతగా ఇంటర్మీడియట్ మార్కుల వ్యవహారం అనేకమంది విద్యార్థుల జీవితాలను ప్రభావితం చేస్తోంది. ఊహించని విధంగా ఫెయిల్ కావడంతో ఇప్పటికే చాలా మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. దాంతో, ఈ వ్యవహారంపై నిగ్గు తేల్చేందుకు తెలంగాణ సర్కారు త్రిసభ్య కమిటీ నియమించింది. ఈ కమిటీ విచారణలో ఆసక్తికర అంశాలు బయటపడ్డాయి.
ఇంటర్ మార్కుల్లో తీవ్ర గందరగోళానికి కారణమైన గ్లోబరినా టెక్నాలజీ సంస్థ ఉపయోగించిన సాఫ్ట్ వేర్ లోనే లోపాలు ఉన్నట్టు గుర్తించారు. ఈ సాఫ్ట్ వేర్ ను మార్చకపోతే రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ చేసినా ప్రయోజనం ఉండదని, మళ్లీ అదే రీతిలో మార్కులు తప్పులతడకలుగా వస్తాయని త్రిసభ్య కమిటీ సభ్యులు భావిస్తున్నారు. విచారణలో భాగంగా తాము తెలుసుకున్న అంశాలతో పూర్తి నివేదికను ఇవాళ సాయంత్రం ప్రభుత్వానికి సమర్పించనున్నారు.