Sri Lanka: శ్రీలంకలో మళ్లీ పేలిన బాంబులు.. వణికిపోయిన ప్రజలు!
- రాజధాని కొలంబోలోని మేజిస్ట్రేట్ కోర్టు వద్ద ఘటన
- కూంబింగ్ జరుపుతుండగా పేలుడు
- తప్పిన ప్రాణనష్టం.. ఊపిరి పీల్చుకున్న పోలీసులు
ద్వీప దేశం శ్రీలంక ప్రస్తుతం భయం గుప్పిట్లో బతుకుతోంది. నేషనల్ తౌహీద్ జమాత్(ఎన్టీజే) అనే అతివాద సంస్థ ఈస్టర్ రోజున సృష్టించిన మారణకాండలో ఏకంగా 359 మంది చనిపోయిన నేపథ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న భయం లంక వాసుల్లో నెలకొంది. ముఖ్యంగా కొలంబో లాంటి కీలక పట్టణాల్లో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికే జంకుతున్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా కొలంబోలో ఈరోజు మరోసారి పేలుడు సంభవించింది. భద్రతాబలగాలు రాజధానిలోని అడుగడుగున జల్లెడ పడుతుండగా, పుగోడ మెజిస్ట్రేట్ కోర్టు వద్ద పేలుడు జరిగిందని పోలీస్ శాఖ అధికార ప్రతినిధి రువాన్ గుణశేఖర తెలిపారు. ఈ ఘటనలో అధికారులు, ప్రజలు ఎవరూ గాయపడలేదన్నారు. ప్రజలెవరూ భయపడవద్దని సూచించారు. శ్రీలంకలో ఉగ్రపేలుళ్లకు సంబంధించి ఇప్పటివరకూ 60 మంది అనుమానితులను అరెస్ట్ చేశామన్నారు.