Uttar Pradesh: రెండు దశాబ్దాలుగా ఆజంఖాన్ రిగ్గింగుతోనే గెలుస్తున్నారు: జయప్రద ఆరోపణలు
- ఆజంఖాన్ పై పోటీ చేస్తున్న జయప్రద
- ముస్లింలను పోలింగ్ కేంద్రాలకు రాకుండా అడ్డుకుంటున్నారన్న ఆజంఖాన్
- రాంపూర్‌లోని ప్రతీ పోలింగ్ కేంద్రంలో నకిలీ ఓటర్లు ఉన్నారన్న జయప్రద
ఒకప్పుడు మిత్రులుగా ఉన్న నటి జయప్రద, ఆజంఖాన్‌లు ఇటీవల ప్రత్యర్థులుగా మారి పరస్పర ఆరోపణలు గుప్పించుకుంటున్నారు. జయప్రదపై ఇటీవల ఆజంఖాన్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపాయి. ఎన్నికల నేపథ్యంలో నేతలిద్దరి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా, ఆజంఖాన్‌పై జయప్రద మరోమారు తీవ్ర ఆరోపణలు చేశారు. గత రెండు దశాబ్దాలుగా ఆయన రిగ్గింగుతోనే విజయం సాధిస్తున్నారని అన్నారు. ఉత్తరప్రదేశ్ రాంపూర్‌లోని ప్రతీ పోలింగ్ కేంద్రంలోనూ నకిలీ ఓటర్లు ఉన్నారని, వాటితోనే ఆయన గెలుస్తూ వస్తున్నారని జయప్రద అన్నారు.
తన పార్లమెంటు నియోజకవర్గమైన రాంపూర్‌లో ముస్లింలను ఓటేయకుండా అధికారులు అడ్డుకుంటున్నారని ఆజంఖాన్ ఇటీవల ఆరోపించారు. ఇక్కడ ముస్లింల ఇళ్లను దోచుకుంటున్నారని, అందరూ కలిసి వారిని కొడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వారు ఓటేసేందుకు బయటకు రావద్దని పోలీసులు ఆదేశించారని ఆజంఖాన్ పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలపై స్పందించిన జయప్రద మాట్లాడుతూ.. ఈ వ్యాఖ్యలు చేశారు. గత 20 ఏళ్లుగా ఆయన కేవలం రిగ్గింగు ద్వారా మాత్రమే గెలుస్తున్నారని ఆరోపించారు.