CM PA: సీఎం పీఏనంటూ ఎమ్మెల్యేకే టోకరా...రూ.10 లక్షలు పంపాలని డిమాండ్
- ముమ్మిడివరం శాసన సభ్యుడు దాట్ల బుచ్చిబాబుకు ఫోన్‌కాల్
- వరుసగా రెండు సార్లు ఫోన్‌తో అనుమానం
- వాస్తవం తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు
ముఖ్యమంత్రి పేరు చెబితే ఓ ఎమ్మెల్యే స్పందన ఎలా వుంటుంది?. సరిగ్గా ఇదే లాజిక్‌ను తన మోసానికి ఉపయోగించుకోవాలనుకున్నాడో గుర్తు తెలియని వ్యక్తి. కానీ ఎమ్మెల్యే అప్రమత్తం కావడంతో అతని ఆటలు సాగలేదు. వివరాల్లోకి వెళితే... ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిరాజుకు మంగళవారం ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేశాడు.
తాను ముఖ్యమంత్రి పర్సనల్ సెక్రటరీ శ్రీనివాస్‌ని మాట్లాడుతున్నానని పరిచయం చేసుకున్నాడు. మీరు పది లక్షల రూపాయలు విశాఖపట్నం తీసుకురావాలని సార్ చెప్పారని, మిగిలిన విషయాలు సాయంత్రం సీఎంగారే మీతో ఫోన్‌లో మాట్లాడుతారని తెలిపాడు. తొలుత ఫోన్ వాస్తవమేననుకున్న బుచ్చిబాబు హడావుడి పడుతుండగా సాయంత్రం మరోసారి ఫోన్ వచ్చింది.
ఆపై ఎమ్మెల్యేకు అనుమానం రావడంతో, సీఎం కార్యాలయానికి ఫోన్ చేయగా, అది నకిలీ ఫోన్ కాల్ అని తేలింది. దీంతో అప్రమత్తమైన ఆయన ముమ్మిడివరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.