Narendra Modi: అక్కడ పాములు పట్టేవాళ్ల ఇళ్లలో మోదీకి పూజాపునస్కారాలు!
- మోదీనే వారికి దేవుడు
- బస్తీ నిండా పాములు పట్టేవాళ్లే!
- స్కూలు సమీపంలో మోదీకి మందిరం
ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ లో అనేక గిరిజన తెగలు మనుగడ సాగిస్తున్నాయి. మోర్బీ జిల్లాలోని వసాహత్ బస్తీలో కొందరు పాములు పట్టేవాళ్లు నివాసం ఉంటున్నారు. ఆ బస్తీలో దాదాపు 200 వరకు ఇళ్లుంటాయి. విచిత్రం ఏంటంటే, వీరికి మోదీయే దేవుడు. ప్రతి ఇంట్లో దేవుడి పటాల పక్కనే మోదీ చిత్రపటాలు కూడా ఉంటాయి. దేవుళ్లతోపాటు మోదీకి కూడా ధూపదీప నైవేద్య సహితంగా పూజాదికాలు నిర్వహిస్తుంటారు. ఆయనంటే అంత భక్తి! అందుకు కారణం లేకపోలేదు.
మోదీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వసాహత్ బస్తీ ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు గణనీయమైన కృషి చేశారు. పాములు పట్టే వృత్తిని వదిలేసి సామాజికంగా ఎదగాలని ప్రోత్సహించడమే కాకుండా, వారికి అవసరమైన అన్నిరకాల సాయాలు అందించారు. ఇతర ఉపాధి మార్గాల్లో వసాహత్ బస్తీ ప్రజలకు అవకాశాలు కల్పించారు.
ప్రతి కుటుంబానికి పక్కా ఇల్లు కట్టించడమే కాదు, వాళ్ల పిల్లల కోసం స్కూలు కూడా ఏర్పాటు చేశారు. ఆ స్కూలు ఏ కార్పొరేట్ పాఠశాలకు తీసిపోని విధంగా ఉంటుంది. 20 కంప్యూటర్లతో ల్యాబ్, తాగునీటి సదుపాయం కల్పించారు. ఈ స్కూలుకు సమీపంలోనే మోదీకి గుడి కట్టారు. ప్రతి రోజూ స్కూలుకు వచ్చే చిన్నారులు ఇక్కడ మోదీ చిత్రపటానికి దండం పెట్టుకుని వెళతారంటే అతిశయోక్తి కాదు.