Tollywood: ఇంట్లో ఫంక్షన్ ఉండడంతో చివరి నిమిషంలో శ్రీలంక పర్యటన రద్దు చేసుకుని బతికిపోయిన శివాజీరాజా

  • దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన నటుడు
  • స్నేహితుడు మృతి, మరో స్నేహితుడికి గాయాలు
  • రెండు నెలల కిందట కూడా శ్రీలంక వెళ్లామంటూ వెల్లడి

శ్రీలంక బాంబు పేలుళ్లలో అనేకమంది భారతీయులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో ప్రముఖ సినీ నటి రాధిక తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఆమె హోటల్ గది ఖాళీ చేసిన కొద్దిసేపటికే ఉగ్రదాడులు జరిగాయి. టాలీవుడ్ ప్రముఖుడు శివాజీరాజా కూడా అదృష్టవశాత్తు ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే వెల్లడించారు. తాను కూడా ఫ్రెండ్స్ తో శ్రీలంక వెళ్లాల్సి ఉందని, తన కుటుంబంలో ఓ కార్యక్రమం కోసం చివరి నిమిషంలో టూర్ క్యాన్సిల్ చేసుకున్నానని వివరించారు.

అయితే, తన బెస్ట్ ఫ్రెండ్ మాకినేని శ్రీనివాసబాబు, అతని కజిన్ తులసీరామ్ శ్రీలంక వెళ్లి ఉగ్రదాడుల్లో చిక్కుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దాడుల్లో తులసీరామ్ చనిపోగా, శ్రీనివాసబాబుకు గాయాలయ్యాయని తెలిపారు. శ్రీనివాసబాబుకు, తనకు ప్రపంచయానం అంటే ఎంతో ఇష్టమని, ఇప్పటివరకు 35 దేశాలు తిరిగామని శివాజీరాజా చెప్పారు. రెండు నెలల క్రితం కూడా శ్రీలంక టూర్ కు వెళ్లామని, అప్పుడు కూడా తాము హోటల్ షాంఘ్రీలాలోనే బస చేశామని చెప్పారు.

ఇప్పుడు కూడా తాను శ్రీలంక వెళ్లాననుకుని చాలామంది ఫోన్లు చేసి ఎలా ఉన్నారు అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారని వివరించారు. స్నేహితుల్లో ఒకరు మృతిచెందడం తనను తీవ్రంగా కలచివేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News