KTR: వెంటనే రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ లకు దరఖాస్తు చేసుకోండి: ఇంటర్ విద్యార్ధులకు కేటీఆర్ సూచన
- ఫలితాలపై ఆందోళన వద్దు
- ఏ ఒక్క విద్యార్థికి నష్టం జరగకుండా చూస్తాం
- ముగ్గురు ఉన్నతాధికారులతో కమిటీ వేశాం
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ ఫలితాలు ఎంత గందరగోళం సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మార్కుల విషయంలో ఎన్నడూ లేనంత అపోహలు ఏర్పడడంపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఫలితాల విషయంలో తల్లిదండ్రులు ఆందోళన పడవద్దని విజ్ఞప్తి చేశారు. ఏ ఒక్క విద్యార్థికి కూడా నష్టం జరగని రీతిలో ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించిందని స్పష్టం చేశారు.
ఇంటర్ ఫలితాల్లో ఏమైనా పొరబాట్లు దొర్లినట్టు భావిస్తే వెంటనే రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోవాలంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. అంతేకాకుండా, ఇంటర్ ఫలితాల విషయంలో ఏర్పడ్డ అయోమయాన్ని తొలగించేందుకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి ముగ్గురు ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు చేశారని, ఈ కమిటీ నివేదిక వస్తే అన్ని విషయాలు వెల్లడవుతాయని కేటీఆర్ తన ట్వీట్ లో తెలిపారు.