BJP: చేస్తున్న పనులు కూడా ఆపేసి.. మోదీ కోసం భారత్ చేరుకున్న 1000 మంది ఎన్నారైలు
- ప్రత్యేకమైన టీషర్టులు, టోపీలతో హంగామా
- మోదీకి అనుకూలంగా ప్రచారం
- 'ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్' అంటూ నినాదాలు
భారత్ లో ఎన్నికల కోలాహలం కొనసాగుతోంది. లోక్ సభ ఎన్నికలు పలు విడతలుగా జరుగుతుండడంతో దేశంలో అనేక ప్రాంతాల్లో ఎన్నికల హడావుడి నెలకొంది. ఈ నేపథ్యంలో, ప్రధాని నరేంద్ర మోదీపై అభిమానంతో విదేశాల్లో ఉంటున్న 1000 మంది ప్రవాసులు భారత్ చేరుకున్నారు. వీరందరూ ప్రత్యేకమైన ఆహార్యంతో మోదీ కోసం ప్రచారం చేస్తున్నారు. మెడలో కాషాయ కండువాలు, 'ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్' అనే స్లోగన్ తో కూడిన టీషర్టులు ధరించి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
అంతేకాదు, ప్రతి ఒక్కరూ 'సబ్ కా సాథ్, సబ్ కా వికాస్' అనే నినాదంతో కూడిన టోపీలు ధరించి మోదీని గెలిపించాలంటూ ఇంటింటికీ తిరుగుతున్నారు. యూఎస్ లోని చికాగోలో ఓ ఐటీ కంపెనీ నడుపుతున్న నీరవ్, ఉగాండాలో వ్యాపారం చేసే నరేన్ మెహతా, చికాగోలో వైద్యసేవలు అందిస్తున్న డాక్టర్ ఇంద్రవదన్ పటేల్, కెనడా వాసి నరేష్ చావ్డా తదితరులు మోదీ కోసం స్వచ్ఛందంగా భారత్ వచ్చి ప్రచారం చేస్తున్నారు. స్వచ్ఛ భారత్, మేకిన్ ఇండియా వంటి మోదీ విధానాలు తమనెంతగానో ఆకట్టుకున్నాయని వారు చెబుతున్నారు.