Andhra Pradesh: సహజీవనం చేసి ముఖం చాటేసిన ప్రియుడు.. యువతిపై ప్రియుడి తల్లి దాడి!

  • శ్రీకాకుళం జిల్లాలో ఘటన
  • కొన్నేళ్ల పాటు సహజీవనం చేసిన జంట
  • యువతికి న్యాయం చేయాలంటూ మహిళా సంఘాల ఆందోళన

ప్రేమించాను అనీ, జీవితాంతం తోడుగా ఉంటానని బాసలు చేశాడు. కానీ కోరిక తీర్చుకుని ముఖం చాటేశాడు. దీంతో తనకు న్యాయం చేయాలని యువతి ఆందోళనకు దిగగా ప్రియుడి తల్లి ఆమెపై దాడిచేసింది. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకుంది.

జిల్లాలోని పలాస మండలం శాశనాం గ్రామానికి చెందిన డొంకాన వనజాక్షి, బ్రాహ్మణతర్లా గ్రామం హరిజనకాలనీకి చెందిన బడియా దిలీప్‌ ప్రేమించుకున్నారు. కొద్దికాలానికే విశాఖపట్నంలో ఓ గది తీసుకుని సహజీవనం చేయడం మొదలుపెట్టారు. ఈ విషయం తెలుసుకున్న దిలీప్ తల్లి భానుమతి కుమారుడిని బలవంతంగా సొంతూరికి తీసుకెళ్లింది. దీంతో వనజాక్షి తనకు న్యాయం చేయాలని బ్రాహ్మణతర్లా గ్రామపెద్దలను, మహిళా సంఘాలను ఆశ్రయించింది.

అయితే పెళ్లి చేసుకుంటాననీ, న్యాయం చేస్తానని పెద్దల ముందు చెప్పిన దిలీప్, ఆ తర్వాత పరారయ్యాడు. ఏం చేయాలో అర్ధంకాని వనజాక్షి దిలీప్ ఇంటికి వచ్చింది. కానీ దిలీప్ తల్లి భానుమతి, తండ్రి రాజు ఆమెను ఇంట్లోకి రానివ్వలేదు. దీంతో బాధితురాలు ప్రియుడి ఇంటి బయటే మౌనపోరాటానికి దిగింది. ఈ సందర్భంగా స్థానికులు ఆమెకు గత నాలుగు రోజులుగా భోజనం అందజేశారు.

ఈ క్రమంలో తమ ఇంటి దగ్గర నుంచి వెళ్లిపోవాలని భానుమతి కోరగా, న్యాయం జరిగేవరకూ వెళ్లనని వనజాక్షి స్పష్టం చేసింది. దీంతో ఆగ్రహానికి లోనైన భానుమతి కత్తెరతో వనజాక్షిపై దాడిచేసింది. దీంతో ఆమెను స్థానికులు 108 ద్వారా పలాస ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వనజాక్షిని మోసంచేసిన దిలీప్ ను కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు, ఐద్వా, మహిళా కమిషన్, మానవహక్కుల కమిషన్, సీపీఐ ఎంఎల్‌ లిబరేషన్, న్యూడెమోక్రసీ నాయకులు డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News