Andhra Pradesh: ఏపీపీఎస్సీ నిర్వాకం.. ‘పంచాయతీ కార్యదర్శి’ పరీక్ష ఛాన్స్ కోల్పోయిన 150 మంది అభ్యర్థులు
- విశాఖ జిల్లాలోని ఎస్.రాయపురంలో ఘటన
- ఒక ఊరు పేరు బదులుగా మరో పేరు ముద్రణ
- కన్నీటి పర్యంతమైన విద్యార్థులు
నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఏళ్లతరబడి కష్టపడి ప్రిపేర్ అవుతుంటారు. కానీ కొందరు అధికారుల నిర్లక్ష్యం కారణంగా వారి కష్టం బూడిదలోపోసిన పన్నీరు అవుతోంది. తాజాగా ఏపీపీఎస్సీ అధికారుల నిర్వాకం కారణంగా 150 మంది అభ్యర్థులు పంచాయతీ కార్యదర్శి పరీక్ష రాసే అవకాశాన్ని కోల్పోయారు. ఏపీపీఎస్సీ పంచాయతీ కార్యదర్శి స్క్రీనింగ్ పరీక్షను ఈరోజు నిర్వహించారు. ఇందులో భాగంగా విశాఖలోని ఎస్.రాయపురం తిమ్మాపురంకు బదులుగా ఏపీపీఎస్సీ అధికారులు హాల్ టికెట్ పై భీమిలిలోని తిమ్మాపురాన్ని ముద్రించారు.
దీంతో దాదాపు 150 మంది అభ్యర్థులు భీమిలిలోని తిమ్మాపురానికి చేరుకున్నారు. తీరా పరీక్ష ప్రారంభమయ్యేందుకు కొద్దిసేపటి ముందుకు తమ పేర్లు అక్కడ లేకపోవడంతో విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. పరీక్ష నిర్వాహకులు సైతం ఈ వ్యవహారాన్ని పరిశీలించి ఉన్నతాధికారులకు చేరవేయగా, హాల్ టికెట్ ముద్రణ సందర్భంగా ఈ తప్పిదం చోటుచేసుకున్నట్లు గుర్తించారు. చాలాకాలం తర్వాత జరుగుతున్న పంచాయతీ కార్యదర్శి పరీక్షను రాసే అవకాశాన్ని కోల్పోవడంతో అభ్యర్థులు కన్నీటిపర్యంతమయ్యారు.
మరోవైపు ప్రకాశం జిల్లాలోనూ ఇదే తరహా ఘటన చోటుచేసుకుంది. జిల్లా కేంద్రంలోని ట్రినిటీ కాలేజీకి బదులుగా అభ్యర్థుల హాల్ టికెట్లలో విజయతేజ కళాశాల అంటూ ముద్రించారు. అడ్రస్ ఒకటే అయినప్పటికీ కొత్తపేరు కావడంతో అభ్యర్థులు తలలు పట్టుకున్నారు. దీనిపై అధికారులు ఇంతవరకూ స్పందించలేదు. పరీక్షల నిర్వహణలో ఏపీపీఎస్సీ నిర్లక్ష్యం నిరుద్యోగుల పాలిట శాపంగా మారుతోందని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.