VV Lakshminarayana: 'మరీ ఇన్ని అబద్ధాలా?' అంటూ విజయసాయిరెడ్డికి లక్ష్మీనారాయణ ఘాటు కౌంటర్

  • రెడ్ కార్పెట్ పరిచి ఆహ్వానిస్తానన్న విషయాన్ని మర్చిపోయారా?
  • మీ హైదరాబాద్, ఢిల్లీ ట్యూషన్లు సరిగ్గా పనిచేయట్లేదు
  • మీ అసత్య ట్వీట్లకు సమాధానాలు ఇచ్చి టైం వేస్టు చేసుకోలేను

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి-జనసేన నేత, సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. 88 స్థానాల్లో విజయం సాధిస్తామంటూ లక్ష్మీనారాయణ చేసిన వ్యాఖ్యలను విజయసాయిరెడ్డి ఎద్దేవా చేయడంతో వీరిద్దరి మధ్య ట్విట్టర్ వార్ మొదలైంది. శనివారం ఇది మరింత ముదిరింది. మూడు నెలల్లో మూడు పార్టీలు మారారంటూ తనను ఎద్దేవా చేసిన విజయసాయికి లక్ష్మీనారాయణ శనివారం మరింత ఘటుగా బదులిచ్చారు.

తాను రాజకీయాల్లో చేరబోతున్నట్టు ప్రకటించగానే అనేక పార్టీలు తనను ఆహ్వానించాయని, ఈ విషయాన్ని మీడియాతో పలుమార్లు చెప్పానని పేర్కొన్న లక్ష్మీనారాయణ.. అందులో వైసీపీ కూడా ఉందన్నారు. రెడ్ కార్పెట్ పరిచి మరీ తనను ఆహ్వానిస్తానని చెప్పింది మీరు కాదా? అని విజయసాయిని ప్రశ్నించారు. ఈ విషయాన్ని ఎక్కడా బయటపెట్టని మీ తీరు చూస్తుంటే ప్రజల దగ్గర ఇంకెన్ని విషయాలు దాస్తున్నారోనని అనుమానంగా ఉందన్నారు. వైసీపీ ఆహ్వానాన్ని గౌరవంగా తిరస్కరించినందుకు మీ బాధను ఇలా వ్యక్తం చేస్తున్నారా? అని నిలదీశారు.

అంతేకాదు, జనసేన 65 స్థానాల్లో పోటీ చేసి, 80 స్థానాల్లో డమ్మీ అభ్యర్థులను నిలిపిందన్న విజయసాయి వ్యాఖ్యలకు కూడా లక్ష్మీనారాయణ బదులిచ్చారు.  ‘‘మీ హైదరాబాద్, ఢిల్లీ ట్యూషన్లు కూడా సరిగ్గా పనిచేయట్లేదు. ట్యూషన్ మాస్టార్లు కోప్పడతారు. ఓసారి లెక్కలు సరి చూసుకోండి. ఎగువ సభ ఔన్నత్యాన్ని నిలబెట్టండి. ప్రజలందరూ చూస్తున్నారు. మాది పారదర్శకమైన పార్టీ. మా జనసేన హోదాలతో పనిచేసే పార్టీ కాదు, హృదయాలతో పనిచేసే పార్టీ’’ అని ట్వీట్ చేశారు.

‘‘నేను ప్రస్తుతం రాష్ట్రాన్ని, దేశాన్ని పట్టి పీడిస్తున్న పేదరికం, నిరుద్యోగ నిర్మూలనకై పాలసీ తయారీలో నిమగ్నమై ఉన్నాను. దీనికి మీ దగ్గర ఏమైనా ప్రత్యామ్నాయాలు వుంటే నాకు తెలియజేయగలరు. మీ అసత్య ట్వీట్లకు సమాధానమిస్తూ నా అమూల్యమైన సమయాన్ని వృథా చేసుకోలేను. ఇది మీరు గమనించగలరు. ఇకపై మీ ట్వీట్లకు మా జనసైనికులు అవసరం అనుకుంటే సమాధానమిస్తారు! ధన్యవాదాలు’ అంటూ లక్ష్మీనారాయణ ఘాటు రిప్లై ఇచ్చారు.  

VV Lakshminarayana
vijayasai reddy
Jana sena
YSRCP
Twitter war
  • Loading...

More Telugu News