GVL: డిగ్రీ తర్వాత పీజీ చదవకుండా ఎంఫిల్ ఎలా చేస్తారో రాహుల్ చెప్పాలి: జీవీఎల్
- రాహుల్ పొంతనలేని సమాచారం ఇచ్చారు
- 1994లో డిగ్రీ చదివి వెంటనే ఎంఫిల్ చేశారా?
- సమాచారం లేకనే గడువు తీసుకున్నారు
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఎన్నికల అఫిడవిట్ రోజురోజుకూ ఓ ప్రహసనంలా మారుతోంది. అమేథీ నియోజకవర్గంలో ఆయన దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్ అంతా తప్పుల తడక అని ప్రత్యర్థులు ఆరోపణలు గుప్పిస్తున్నారు. దాంట్లో అన్నీ అవాస్తవాలేనని బీజేపీ అంటోంది.
తాజాగా, బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు స్పందిస్తూ, రాహుల్ తాను ఎంఫిల్ చేశానని అఫిడవిట్ లో పేర్కొన్నారని, 1994లో డిగ్రీ చదివి, 1995లో ఎంఫిల్ చేసినట్టు వెల్లడించారని ఆరోపించారు. డిగ్రీ తర్వాత పీజీ చేయకుండా ఒక్కసారిగా ఎంఫిల్ ఎలా చదివారో రాహుల్ చెప్పాలంటూ జీవీఎల్ డిమాండ్ చేశారు.
ఎన్నికల అఫిడవిట్ లో రాహుల్ పొంతనలేని సమాచారం ఇచ్చారని ఆయన విమర్శించారు. రాహుల్ విద్యార్హతలు, పౌరసత్వంపై ఎప్పటినుంచో వివాదాలు ఉన్నాయని తెలిపారు. ఈ అసంబద్ధతలపై ఎన్నికల సంఘం తరఫున రిటర్నింగ్ అధికారి రాహుల్ న్యాయవాదిని వివరణ కోరారని, అయితే వాళ్ల వద్ద సరైన సమాచారం లేనందునే మరింత గడువు తీసుకున్నారని జీవీఎల్ అన్నారు.