Narendra Modi: మోదీ వెబ్ సిరీస్ పై ఆంక్షల కొరడా ఝుళిపించిన ఎన్నికల సంఘం
- ప్రసారాన్ని వెంటనే నిలిపివేయాలి
- ఎరోస్ నౌ చానల్ కు ఆదేశాలు
- కంటెంట్ తొలగించాలని చెప్పిన ఈసీ
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, ప్రధాని నరేంద్ర మోదీ జీవితం ఆధారంగా రూపుదిద్దుకున్న వెబ్ సిరీస్ ప్రసారం చేయకుండా నిలిపివేయాలంటూ ఎరోస్ నౌ చానల్ కు ఎన్నికల సంఘం ఆదేశాలు జారీచేసింది. ఎరోస్ నౌ చానల్ లో 'మోదీ- జర్నీ ఆఫ్ ఏ కామన్ మ్యాన్' పేరుతో కొన్నిరోజులుగా వెబ్ సిరీస్ ప్రసారమవుతోంది. ఎరోస్ నౌ ఇప్పటివరకు 5 ఎపిసోడ్ లు ప్రసారం చేసింది.
దీనిపై అభ్యంతరాలు రావడంతో మోదీ వెబ్ సిరీస్ ప్రసారాన్ని నిలిపివేయాలంటూ స్పష్టం చేసింది. అంతేగాకుండా, ఈ వెస్ సిరీస్ కు సంబంధించిన మొత్తం కంటెంట్ ను డిజిటల్ ప్లాట్ ఫాం నుంచి తొలగించాలని ఆదేశించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది.
ఇప్పటికే నరేంద్ర మోదీ జీవితంపై తెరకెక్కిన బయోపిక్ పీఎం మోదీ చిత్రంపైనా ఎన్నికల సంఘం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఎన్నికలు పూర్తయ్యేవరకు ఈ చిత్రాన్ని విడుదల చేయొద్దని నిర్మాతలను ఆదేశించింది. ప్రస్తుతం ఈ వ్యవహారం సుప్రీం కోర్టుకు చేరింది. సినిమా చూసిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని అత్యున్నత న్యాయస్థానం ఈసీని ఆదేశించింది.