Chandrababu: చంద్రబాబులో ఇప్పటికీ అదే కళ కనిపిస్తోంది: దివ్యవాణి
- సీఎం జన్మదిన వేడుకల్లో పాల్గొన్న నటి
- కుట్రలు తట్టుకుని నిలిచారంటూ ప్రశంసలు
- దేవుడు చంద్రబాబు పక్షానే ఉన్నారంటూ వ్యాఖ్య
ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు జన్మదినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా పార్టీ నేత దివ్యవాణి మాట్లాడుతూ, అనేక కుట్రలను తట్టుకుని ఎదురునిలిచిన నేత చంద్రబాబు అని కొనియాడారు. ప్రధాని నరేంద్ర మోదీ, ప్రతిపక్ష నేతలు ఎన్ని ఇబ్బందులకు గురిచేయాలని చూసినా, చెక్కుచెదరని నైజంతో అందరినీ ఆకట్టుకుంటున్నారని తెలిపారు.
"చంద్రబాబు అంటేనే న్యాయం, సమర్థత. ఒకటి కాదు, అనేక కుట్రలు చేసినా చంద్రబాబును ఏమీ చేయలేకపోయారని యావత్ రాష్ట్రం తెలుసుకుంది. దేవుడు న్యాయం పక్షాన ఉంటాడు. మన ఇంటి మనిషిగా ఇవాళ చంద్రబాబుకు మహిళలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. పోలింగ్ సందర్భంగా అర్ధరాత్రి 2 గంటలకు, 3 గంటలకు కూడా మహిళలు ఎంతో ఓర్పుతో ఓట్లు వేశారు. ఆ విధంగా మా చంద్రన్నపై ప్రేమను చూపించుకున్నారు.
మూడు నెలల ముందు నుంచీ ఆయన పడుతున్న కష్టం, శ్రమ మేం దగ్గర్నుంచి చూశాం. అప్పటినుంచి అదే ఆత్మవిశ్వాసం, అదే ప్రశాంతత ఆయనలో కనిపిస్తున్నాయి. నేటికీ అదే తీరులో అవిశ్రాంతంగా పనిచేస్తున్నా కానీ, ఆయనలో కళ ఏమాత్రం తగ్గలేదు. ఆయనకు పరిపూర్ణ ఆయుష్షును, మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని దేవుడ్ని కోరుకుంటున్నాను. శత్రువుల్ని సైతం మిత్రులుగా మార్చుకునే శక్తిని ఆయనకు దేవుడు ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను" అంటూ వ్యాఖ్యానించారు.