MSK prasad: ఎమ్మెస్కే పేరుతో డబ్బుల వసూలుకు యత్నం.. స్వయంగా టీడీపీ విశాఖ ఎంపీ అభ్యర్థి భరత్‌కు ఫోన్
- ఎమ్మెస్కేను మాట్లాడుతున్నానంటూ ప్రముఖులకు ఫోన్లు
- స్వయంగా ప్రసాద్‌కే ఫోన్ చేసి బురిడీ
- చక్రి పేరుతో నాటకం ఆడిన యువకుడికి అరదండాలు
భారత జట్టు చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ పేరుతో ఫేస్బుక్లో ఉన్న నకిలీ ఖాతా ఒకటి తాజాగా వెలుగుచూడగా, ఓ యువకుడు ఏకంగా ప్రసాద్ పేరుతో డబ్బులు దండుకునే ప్రయత్నం చేసిన ఘటన ఒకటి బయపడింది. ఓ రాజకీయ పార్టీ అగ్రనేతకు పీఏ నంటూ చక్రి అనే యువకుడు ఇటీవల ఎమ్మెస్కేకు ఫోన్ చేశాడు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సభ్యుడైన నాగరాజు అనే యువకుడు కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకు ఎంపికయ్యాడని, కిట్ కొనేందుకు రూ. 2.85 లక్షలు పంపాలని కోరాడు.
దీనికి సరేనన్న ఎమ్మెస్కే వివరాలు పంపాలని కోరారు. దీంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, ఐపీఎల్ ప్రతినిధి రాజీవ్ శుక్లా పేర్లతో నకిలీ లేఖలు సృష్టించి పంపాడు. అంతేకాదు, విశాఖపట్నం నోవాటెల్ యజమాని ప్రభు కిషోర్, గీతం గ్రూప్ విద్యా సంస్థల చైర్మన్, తెదేపా విశాఖ ఎంపీ అభ్యర్థి ఎం.శ్రీభరత్, కోనేరు ప్రసాద్, విశాఖపట్నం ఎస్బీఐ ప్రాంతీయ మేనేజర్ జి.వెంకటశాస్త్రిలకు ఫోన్ చేసి, తాను ఎమ్మెస్కే ప్రసాద్నంటూ పరిచయం చేసుకున్నాడు.
ఆ తర్వాత నకిలీ లేఖలు తీసుకుని మార్చి చివరి వారంలో వైజాగ్‌లో వాలిన చక్రి తనను ఎమ్మెస్కే పంపించాడంటూ లేఖలు చూపించాడు. అయితే, అనుమానం వచ్చిన వారు ఎమ్మెస్కేకు ఫోన్ చేయగా చక్రి బండారం బయటపడింది. తాను ఎవరినీ పంపలేదని చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు చక్రి పేరుతో ఈ మొత్తం నాటకం ఆడిన బుడుమూరి నాగరాజ్‌ను అదుపులోకి తీసుకుని ఆటకట్టించారు. మరో ఘటనలో గుంటూరులోని ఓ పేకాట క్లబ్ నిర్వాహకుడు ఎమ్మెస్కే పేరును ఉపయోగించుకోవాలని ప్రయత్నించగా పోలీసులు అతడి ఆటను కూడా కట్టించారు.