Kurnool District: మరణించిన టీచర్‌కు స్పాట్ వాల్యుయేషన్ విధులు.. రాలేదని షోకాజ్ నోటీసులు
- ఫిబ్రవరి 23న అనారోగ్యంతో మృతి చెందిన ఉపాధ్యాయురాలు
- పదో తరగతి మూల్యాంకన విధులు కేటాయింపు
- ఎంఈవో తప్పిదం వల్లేనన్న డీఈవో
పదో తరగతి ప్రశ్న పత్రాలు దిద్దే విధులు కేటాయించిన ఉపాధ్యాయురాలు గైర్హాజరు కావడాన్ని తీవ్రంగా పరిగణించిన విద్యాశాఖాధికారులు ఆమెకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. విధులపట్ల ఆమె నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ వివరణ ఇవ్వాలని కోరారు. అంతవరకు బాగానే ఉంది కానీ.. ఆ టీచర్ ఎప్పుడో మృతి చెందడమే ఇప్పుడు హాట్ టాపిక్.
కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలో జరిగిన ఈ ఘటన విద్యాశాఖాధికారుల నిర్లక్ష్యాన్ని కళ్లకు కడుతోంది. నన్నూరులోని ఎంపీయూపీ ఉర్దూ పాఠశాలలో పనిచేసే ఎస్జీటీ ఎస్.ఖమరున్నీసా ఫిబ్రవరి 23న అనారోగ్యంతో మృతి చెందారు. తాజాగా, ఆమెకు పదో తరగతి మూల్యాంకనం విధులు కేటాయించారు. ఆమె రాకపోవడంతో సంజాయిషీ కోరుతూ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. విషయం తెలిసిన ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. చనిపోయిన వ్యక్తికి విధులు కేటాయించడమే కాకుండా రాలేదంటూ షోకాజ్ నోటీసులు పంపడంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి.
వెల్లువెత్తుతున్న విమర్శలపై డీఈవో తాహేరా సుల్తానా స్పందించారు. ఉపాధ్యాయుల జాబితాను ఎంఈవో పరిశీలించకుండా పంపడం వల్లే ఈ పొరపాటు జరిగిందన్నారు. ఎంఈవో నిర్లక్ష్యంపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.