Chandrababu: ఏపీలో లా అండర్ ఆర్డర్ బాగుందని జగన్ ఎప్పుడు చెప్పాడు గనుక!: చినరాజప్ప
- జగన్ పార్టీకి ప్రతిపక్ష హోదా డౌటే
- అమరావతిలో హోంశాఖ సమీక్ష
- చంద్రబాబు అధ్యక్షతన హోంమంత్రి, ఇతర అధికారులు సమావేశం
ఏపీలో ఎన్నికల అనంతరం హోంశాఖ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సీఎం చంద్రబాబు, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, రాష్ట్ర డీజీపీ ఆర్పీ ఠాకూర్ సహా ఇతర పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సమీక్ష నేపథ్యంలో చినరాజప్ప మాట్లాడుతూ జగన్ పై విమర్శలు చేశారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలు బాగున్నాయని జగన్ ఏనాడూ చెప్పలేదని అన్నారు. వైసీపీది అరాచకత్వం అని పేర్కొన్న ఆయన వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురైంది జగన్ కుటుంబీకుల చేతుల్లోనే అని ఆరోపించారు. అంతేకాకుండా, సత్తెనపల్లెలో స్పీకర్ కోడెల శివప్రసాదరావుపైన దాడి కూడా ఎవరి పనో ప్రత్యేకంగా చెప్పనవసరంలేదన్నారు.
ఈసారి జగన్ పార్టీకి ప్రతిపక్ష హోదా రావడం సందేహాస్పదమేనని వ్యాఖ్యానించారు. టీడీపీకి 110 నుంచి 120 స్థానాల వరకు వస్తాయని నమ్ముతున్నామని స్పష్టం చేశారు. జగన్ ఇప్పటికే తన ఓటమిని ముందే ఖాయం చేసుకున్నారని ఎద్దేవా చేశారు.