Hyderabad: ఈ నెల 19న హైదరాబాదులో శోభాయాత్ర
- గౌలిగూడ రామాలయం నుంచి తాడ్ బండ్ వరకు యాత్ర
- శోభాయాత్ర వెళ్లే మార్గాన్ని పరిశీలించిన అధికారులు
- 12 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు
ఈ నెల 19న హైదరాబాద్ లో శోభాయాత్ర జరగనుంది. గౌలిగూడ రామాలయం నుంచి సికింద్రాబాద్ లోని తాడ్ బండ్ వరకు ఈ యాత్ర జరగనుంది. గౌలిగూడ, కాచిగూడ, నారాయణగూడ, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, సికింద్రాబాద్ బాటా, బైబిల్ హౌస్ మీదుగా తాడ్ బండ్ వరకు సుమారు 13 కిలోమీటర్ల మేర ఈ యాత్ర జరగనుంది. ఈ నేపథ్యంలో శోభాయాత్ర వెళ్లే మార్గాన్ని సీపీ అంజనీకుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ దాన కిషోర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా అంజనీకుమార్ మాట్లాడుతూ, శోభాయాత్ర నిర్వహణకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశామని, ఈ యాత్ర సాగే మార్గంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని అన్నారు. 12 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని, కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా శోభా యాత్ర మార్గాన్ని పర్యవేక్షిస్తామని తెలిపారు. శోభాయాత్ర సమయంలో విధించే ట్రాఫిక్ ఆంక్షలకు ప్రజలు సహకరించాలని అంజనీకుమార్ కోరారు.