Tamil Nadu: తమిళనాడు థేని నియోజకవర్గం పరిధిలో ఐటీ దాడులు.. రూ.1.48 కోట్లు స్వాధీనం
- టీటీవీ దినకరన్ పార్టీ కార్యకర్త దుకాణంలో సోదాలు
- కార్యకర్తలు అడ్డుకున్నా ఆగని అధికారులు
- భారీగా నగదు లభించినట్టు ప్రకటన
తమిళనాడులోని థేని నియోజకవర్గం పరిధిలో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించి భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. నియోజకవర్గంలో టీటీవీ దినకరన్ పార్టీకి చెందిన ఓ కార్యకర్త దుకాణంలో భారీగా నగదు ఉందన్న సమాచారం మేరకు ఆదాయ పన్ను శాఖ అధికారులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. సోదాలు నిర్వహించేందుకు సిద్ధపడ్డారు.
ఈలోగా ఈ విషయం తెలుసుకున్న దినకరన్ పార్టీ కార్యకర్తలు అక్కడికి చేరుకొని, వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా అధికారులు, కార్యకర్తల మధ్య స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది. కార్యకర్తలను చెదరగొట్టేందుకు గాలిలోకి కాల్పులు జరిపారు. అనంతరం సోదాలు పూర్తిచేశారు. ఈ సోదాల్లో కోటి 48 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు.
నోట్ల కట్టలతో కూడిన 94 ప్యాకెట్లు లభించాయని తెలిపారు. వాటిపై వార్డు నంబర్లతోపాటు ఓటర్ల సంఖ్య కూడా రాసి ఉందని చెప్పారు. ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. కాగా, విధుల నిర్వహణకు అడ్డుపడిన కొందరు కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.