Karnataka: నోటీసులిచ్చిన సీఐకి ఘాటైన జవాబిచ్చిన కానిస్టేబుల్!
- విధులకు ఆలస్యంగా వస్తున్న కానిస్టేబుల్
- నోటీసులకు సమాధానంలో సీఐ పరువు తీసిన కానిస్టేబుల్
- తన ఇబ్బందులు చెబుతూనే, సీఐ వ్యవహార శైలిపై ప్రశ్నలు
విధులకు ఆలస్యంగా వస్తున్నాడన్న కారణంతో ఓ సీఐ, తన వద్ద పనిచేసే కానిస్టేబుల్ కు నోటీసులు ఇచ్చి, వివరణ కోరగా, సదరు కానిస్టేబుల్ ఇచ్చిన సమాధానం ఇప్పుడు కొత్త చర్చకు దారితీయడంతో పాటు సీఐ పరువు తీసింది. ఈ ఘటన బెంగళూరు బనశంకరిలో జరిగింది. జయనగర్ పోలీసు స్టేషన్ లో ఐదుగురు సిబ్బంది నిత్యం ఆలస్యంగా వస్తున్నారంటూ సీఐ యర్రిస్వామి నోటీసులు ఇచ్చారు. నోటీసులు అందుకున్న శ్రీధర్ గౌడ అనే కానిస్టేబుల్ సమాధానం ఇస్తూ, ఓ లేఖను రాశారు. ఇందులో సీఐ వ్యవహార శైలిని ఆయన ప్రశ్నించారు.
"నేను మీకులా ఉదయం పూట సుఖసాగర్ లేదా యుడి హోటల్ లో టిఫిన్ చేసి, మధ్యాహ్నం ఖానావళిలో భోజనం చేసి, రాత్రి ఎంపైర్ హోటల్ లో డిన్నర్ చేసి, ఆపై మిలనోలో ఐస్ క్రీమ్ తిని, పోలీస్ స్టేషన్ పైనే ఉన్న గదిలో నివాసం లేను. అలా ఉన్నట్లయితే, నేను కూడా ఉదయం పూట తొందరగానే విధులకు వచ్చేవాడిని. నాకు వయసు మీదపడిన తల్లిదండ్రులు, పోలీసు శాఖలోనే పనిచేసే భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారిని చూసుకున్న తరువాత పోలీసు స్టేషన్ కు వస్తున్నాను. అందుకే ఆలస్యం అవుతోందే తప్ప, ఇందులో విధుల పట్ల నిర్లక్ష్యం లేదు" అని సమాధానం ఇచ్చారు.
ఈ లేఖ కర్ణాటక పోలీసు ఉన్నతాధికారులకు కూడా అందినట్టు తెలుస్తోంది. మరి వారి స్పందన ఎలా ఉంటుందో చూడాలి.