KCR: కేసీఆర్ చెయ్యాల్సిందేదో ఆరోజే చేస్తే బాగుండేది: విజయశాంతి

  • కేసీఆర్ మాయమాటలు ప్రజలు నమ్మరు
  • కేసీఆర్ ప్రకటన వెనుక రాజకోట రహస్యం
  • అది త్వరలోనే బయటపడుతుంది

తెలంగాణలో ఇప్పుడు రెవెన్యూ శాఖ విషయం క్రమంగా రగులుకుంటోంది. గతకొంతకాలంగా రెవెన్యూ శాఖ విలీనం, రెవెన్యూ శాఖ రద్దు అంటూ విపరీతంగా ప్రచారం జరుగుతోంది. దాంతో రెవెన్యూ ఉద్యోగులు తమ భవిష్యత్తుపై తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రాజకీయ ప్రత్యర్థులు ఇదే అదనుగా సీఎం కేసీఆర్ పై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. తాజాగా, కాంగ్రెస్ నేత విజయశాంతి కూడా కేసీఆర్ పై ధ్వజమెత్తారు. రెండేళ్ల కిందట మియాపూర్ భూకుంభకోణం బయటపడ్డప్పుడే కేసీఆర్ స్పందించి ఉంటే ఎంతో బాగుండేదని అన్నారు.

అయితే, ఈ స్కాంలో టీఆర్ఎస్ ప్రముఖులకు సంబంధం ఉందని తేలడంతో కేసీఆర్ దాన్ని చూసీచూడనట్టు వదిలేశారని విజయశాంతి మండిపడ్డారు. ఆనాడు టీఆర్ఎస్ కు చెందిన ఓ సీనియర్ నేత మియాపూర్ కుంభకోణంపై తిరుగుబాటు చేసే పరిస్థితి వచ్చినప్పుడు కేసీఆర్ మేల్కొని ఉంటే ఈ పరిస్థితి దాపురించేది కాదన్నారు. అయితే, తమకు అత్యంత సన్నిహితులైన కొందరు నేతలను కాపాడుకునే క్రమంలో కేశవరావు వంటి బడుగు వర్గాల నాయకులను బలిచేశారని ఆరోపించారు.

అవినీతి బాగా ప్రబలిపోయాక ఇప్పుడొచ్చి రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేస్తానంటూ కేసీఆర్ చెప్పే మాటలను ప్రజలు వినే రోజులు పోయాయని విజయశాంతి అన్నారు. కేసీఆర్ తరచుగా రెవెన్యూ ప్రక్షాళన గురించి మాట్లాడుతుండడం వెనుక ఉన్న అసలు రహస్యం త్వరలోనే బట్టబయలవుతుందని జోస్యం చెప్పారు.

KCR
Vijayasanthi
  • Loading...

More Telugu News