Chandrababu: మాండ్యలో సుమలతకు ఓటేయొద్దని చెప్పిన చంద్రబాబు
- ఆమెకు ఓటేస్తే మోదీకి ఓటేసినట్టే
- మోదీ మా రాష్ట్రంపై కక్ష కట్టారు
- మోదీ అండచూసుకుని వైసీపీ రెచ్చిపోయింది
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కర్ణాటకలోని మాండ్య నియోజకవర్గంలో ఎన్నికల సభకు హాజరయ్యారు. జేడీఎస్ అభ్యర్థి, కర్ణాటక సీఎం కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడ కోసం మాండ్య వెళ్లిన చంద్రబాబు, రాజకీయ ప్రత్యర్థులపై ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా పాండవపుర సభలో ఆయన మాట్లాడుతూ, మాండ్య నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తున్న సుమలతకు ఓటేస్తే అది మోదీకి ఓటేసినట్టే అని వ్యాఖ్యానించారు. మాండ్యలో బీజేపీ సుమలతకు మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
దేవెగౌడ మనవడు అయిన నిఖిల్ ను గెలిపించాలని చంద్రబాబు మాండ్య ఓటర్లను కోరారు. సుమలత స్వతంత్ర అభ్యర్థే అయినా ఆమెకు బీజేపీ మద్దతిస్తున్నందున ఆమెను బలపరిస్తే మోదీ నాయకత్వంలోని బీజేపీని బలపరిచినట్టే అని వ్యాఖ్యానించారు. మోదీ తమ రాష్ట్రంపై కక్ష కట్టారని చెప్పిన చంద్రబాబు, మోదీ అండతో ఏపీలో వైసీపీ రెచ్చిపోయి హింసకు పాల్పడిందని ఆరోపించారు. వైసీపీ వాళ్లు ఎన్ని అరాచకాలకు పాల్పడినా ప్రజలు ప్రజాస్వామ్యానికే ఓటేశారని అన్నారు.