mp: చంద్రబాబుని, ఏబీ వెంకటేశ్వరావుని, ఆర్పీ ఠాకూర్ ను జైలుకు పంపేందుకు ఈ ఒక్క కేసు చాలు: విజయసాయిరెడ్డి
- రిటైర్డ్ అధికారి సత్యనారాయణ, బాబుతో లాలూచీ
- ‘ఆధార్’ డేటాను ఆ సంస్థలకు అవుట్ సోర్సింగ్ చేశారు
- ఈ సంస్థలన్నీ ఏబీ వెంకటేశ్వరరావు, ఆర్పీ ఠాకూర్ కు చెందిన వ్యక్తులవి
రిటైర్డ్ అధికారి సత్యనారాయణ అనే వ్యక్తి చంద్రబాబుతో లాలూచీ పడి ‘ఆధార్’ డేటాను ఈ-ప్రగతి అనే సంస్థతో పాటు మరో రెండు సంస్థలకు అవుట్ సోర్సింగ్ చేశారని వైసీపీ నేత విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఢిల్లీలో సీఈసీని కలిసిన అనంతరం, మీడియాతో ఆయన మాట్లాడుతూ, ఈ సంస్థలన్నిటినీ ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా వ్యవహరించిన ఏబీ వెంకటేశ్వరరావు, ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ కు సంబంధించిన కొంత మంది వ్యక్తులు కలిసి ఏర్పాటు చేశారని అన్నారు. ఆ సంస్థలకు ఈ డేటాను అవుట్ సోర్సింగ్ చేసి, అధికారిక డేటాను పూర్తిగా దుర్వినియోగం చేశారని ఆరోపించారు.
‘ఈ-ప్రగతి’ పేరిట కొన్ని వందల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారని, చంద్రబాబునాయుడుని, ఏబీ వెంకటేశ్వరరావుని, ఆర్పీ ఠాకూర్ తో పాటు మిగిలిన వారిని జైలుకు పంపించేందుకు ఈ ఒక్క కేసు చాలు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. వీళ్లను జైలుకు పంపడానికి ఏ కేసూ అవసరం లేదు, ఈ ఒక్క కేసు చాలని, దీనిపై తప్పకుండా ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని అన్నారు. ఎవరైతే చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడ్డారో వాళ్లందరిపైనా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలన్నీ తమ వద్ద ఉన్నాయని, సరైన సమయంలో వాటిని బయటపెడతామని విజయసాయిరెడ్డి చెప్పడం గమనార్హం.