Supreme Court: మీ అధికారాలు ఏమిటో మీకు తెలుసా?: ఈసీపై సుప్రీంకోర్టు ఫైర్
- కోడ్ ఉల్లంఘించిన నేతలపై చర్యలు తీసుకోకపోవడంపై ఆగ్రహం
- వివరణ ఇవ్వాలంటూ ఆదేశం
- సరైన సమాధానాలు ఇవ్వకపోతే సీఈసీని పిలిపిస్తామంటూ హెచ్చరిక
ఎన్నికల సంఘం పనితీరును తప్పుబడుతూ సుప్రీం కోర్టు తీవ్ర విమర్శలను గుప్పించింది. ఎన్నికల కోడ్ ను ఉల్లంఘిస్తున్న ప్రధాన పార్టీల నేతలపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికల కోడ్ ను ఉల్లంఘిస్తున్న నేతలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఎంత మందికి నోటీసులు పంపారు? అని ప్రశ్నించింది. మీ అధికారాలు ఏమిటో మీకు తెలుసా? అని నిలదీసింది. సరైన సమాధానాలను ఇవ్వకపోతే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ను పిలవాల్సి ఉంటుందని హెచ్చరించింది.
విచారణ సందర్భంగా చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ మాట్లాడుతూ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యలను ప్రస్తావించారు. ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకున్నారంటూ ఈసీ తరపు న్యాయవాదిని ప్రశ్నించారు. ఆ కేసు క్లోజ్ అయిందని న్యాయవాది సమాధానమిచ్చారు. దీనిపై గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం స్పందిస్తూ, విచారణకు ఈసీ ప్రతినిధి హాజరు కావాలని... కుల, మతపరమైన విద్వేష వ్యాఖ్యలు చేసేవారిపై నిబంధనల ప్రకారం ఎలాంటి శిక్షలు ఉంటాయో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. సరైన సమాధానాలు ఇవ్వకపోతే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ను పిలిపిస్తామని హెచ్చరించింది.