Chandrababu: ఏపీలో ఏనాడన్నా జరిగిందా ఇలా?: చంద్రబాబు

  • ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నాలు జరిగాయి
  • నేను భయపడుతున్నానని అంటున్నారు
  • నాకెందుకు భయం!

ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఈవీఎంలపై తన పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళుతున్నారు. ఢిల్లీలో ఆదివారం 23 పార్టీలతో సమావేశం నిర్వహించిన ఆయన ఇవాళ ఏపీ రాజధాని అమరావతిలో నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈవీఎంల పనితీరుపై తాము సుదీర్ఘకాలంగా పోరాడుతున్నామని, పేపర్ బ్యాలెట్ తో ఎన్నికలు నిర్వహిస్తే పారదర్శకంగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈవీఎంలతో ఎన్నికలు జరిపినప్పుడు 100 శాతం వీవీ ప్యాట్ స్లిప్పులు లెక్కించాలని ఎన్నికల ప్రకటన రాకముందే కోరామని, కానీ ఎన్నికల సంఘం వీవీ ప్యాట్ స్లిప్పులు లెక్కించడానికి ఆరున్నర రోజులు పడుతుందంటూ సుప్రీం కోర్టుకు తప్పుడు అఫిడవిట్ సమర్పించిందని చంద్రబాబు ఆరోపించారు. ఎన్నికల సంఘం ఏకపక్షంగా ఎందుకు వ్యవహరించాల్సి వచ్చిందని నిలదీశారు.

"మొన్ననే ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరిగాయి. ఈ నేపథ్యంలో కొందరంటున్నారు నేను భయపడుతున్నానని! నాకెందుకు భయం? ఏపీలో ఏనాడన్నా జరిగిందా ఇలా? హైదరాబాద్, చెన్నై, పూణే, బెంగళూరు, షిర్డీ నుంచి, విదేశాల నుంచి ఓటేయడానికి వచ్చారు. వాహనాలు దొరక్కపోతే బైకులు, షేరింగ్ వెహికల్స్ లో వచ్చారు. రైళ్లలో ఎక్కేందుకు వీలు కాకపోతే కిటికీల్లోంచి దూకి లోపలికి ప్రవేశించారు. ఎలాగైనా ఊరికి వెళ్లి ఓటేయాలన్న దృఢసంకల్పంతో ఏది దొరికితే అది పట్టుకుని వచ్చారు. కానీ, ఎన్నికల సంఘం కారణంగా అనేక అవకతవకలు చోటుచేసుకున్నాయి. ఓ పోలింగ్ కేంద్రంలో మధ్యాహ్నం ఒంటి గంటకు ఈవీఎం పనిచేయడం ప్రారంభించింది. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రౌడీయిజం చేసి ఎవరూ ఓటేయకుండా భయభ్రాంతులకు గురిచేయడానికి ప్రయత్నించారు" అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News